తెలంగాణ లో మోడీ ఎన్నికల ప్రచారం

     Written by : smtv Desk | Tue, Nov 27, 2018, 01:55 PM

తెలంగాణ లో మోడీ ఎన్నికల ప్రచారం

నిజామాబాదు, నవంబర్ 27:ప్రధాని నరేంద్ర మోడీ నేడు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆయన మహారాష్ట్రలో నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌ చేరుకొని అక్కడ స్థానిక గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగబోయే బిజెపి బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు మహబూబ్‌నగర్‌ చేరుకొని అక్కడ స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న బిజెపి బహిరంగసభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని డిల్లీ తిరిగి వెళతారు.

ప్రధాని నరేంద్ర మోడీ వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, నితిన్ గడ్కారీ వస్తారని సమాచారం. బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలు అందరూ ఈ రెండు సభలలో పాల్గొంటారు.

ఎన్నికల ప్రచారంలో తెరాస, మహాకూటమి బిఎల్ఎఫ్ దూసుకుపోతున్నాయి. వాటితో పోలిస్తే బిజెపి కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. ఇటీవల బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారంతో బిజెపి శ్రేణులు కూడా ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. నేడు ప్రధాని మోడీ ఒకే రోజు రాష్ట్రంలో రెండు భారీ బహిరంగసభలు నిర్వహిస్తుండటంతో బిజెపి శ్రేణులలో మరింత ఉత్సాహం పెరుగుతుంది. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ తెరాస ప్రభుత్వం, కేసీఆర్‌ను ఉద్దేశ్యించి ఏవైనా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లయితే రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత పెరుగుతుంది.





Untitled Document
Advertisements