గర్భిణీపై వైద్యుల కర్కశత్వం.!

     Written by : smtv Desk | Thu, Dec 06, 2018, 06:15 PM

గర్భిణీపై వైద్యుల కర్కశత్వం.!

భద్రాచలం, డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన పోలవరం ముంపు గ్రామంలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. కేంద్రం పోలవరం ప్రాజెక్టు కింద ముంపుకు గురవుతున్న తెలంగాణ రాష్ట్రంలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయిన పోలవరం ముంపు గ్రామానికి చెందిన ఓ గర్భిణికి చికిత్స అందించేందుకు తెలంగాణ వైద్యులు నిరాకరించారు. కొత్తగూడెం జిల్లాలో నిన్న మధ్యరాత్రి ఈ అమానవీయ ఘటన చోటుచేసుకున్నది.

తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లెతోట గ్రామానికి చెందిన అనూష అనే గర్భిణికి నిన్న అర్ధరాత్రి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సమీపంలోని భద్రాచలంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె ఊరు ఏపీలో ఉండటంతో కాన్పు చేసేందుకు వైద్యులు నిరాకరించారు. అనూష నొప్పులతో బాధపడుతున్న పట్టించుకోకుండా చింతూరు ఏరియా ఆసుపత్రికి పోవాలని సూచించారు. దీంతో బాధితురాలిని తీసుకువెళుతుండగా, ఆసుపత్రి గేటువద్దే ఆమె పండంటి చిన్నారికి జన్మినిచ్చింది. ఈ సంఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీది ఆంధ్రా.. మాది తెలంగాణ. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. మేం మీకు డెలివరీ చేయం అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె రోడ్డుపై ప్రసవించిందనీ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





Untitled Document
Advertisements