త్వరలో ప్రతీ పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ.15లక్షలు : రాందాస్

     Written by : smtv Desk | Tue, Dec 18, 2018, 05:43 PM

త్వరలో ప్రతీ పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ.15లక్షలు : రాందాస్

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకి అనేక హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా ‘బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బుని తీసుకొచ్చి ఇండియాలోని ప్రతీ పౌరుని బ్యాంకు అకౌంట్‌లో 15 లక్షలు డిపాజిట్ చేస్తాం’అని మోడీ చెప్పిన హామీ ప్రజలని ఎక్కువగా ఆకర్షించాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారు.
కానీ, ఎన్నికల తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది. 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా పేద ప్రజల అకౌంట్లలో డిపాజిట్ కాలేదు. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పటికీ చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా ఇస్లాంపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. “త్వరలోనే దేశంలోని ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెల్లిమెల్లిగా ఈ ప్రక్రియను మొదలుపెడతాం. అయితే ఇందుకు కావాల్సిన డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు. ఈ మేరకు డబ్బు బ్యాంకు ఖాతాల్లో వేయాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్‌ను కోరింది… కానీ అందుకు ఆర్‌బీఐ నిరాకరించింది. ఇందుకు సంబంధించి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. అందుకే క్రమక్రమంగా వాళ్లు ఈ ప్రక్రియను మొదలుపెడతారు’ అని తెలిపారు. దీంతో మరిచిపోయిన 15 లక్షల చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.





Untitled Document
Advertisements