సాఫీగా సాగిన కార్మిక సంఘాల సమ్మె...

     Written by : smtv Desk | Wed, Jan 09, 2019, 11:53 AM

 సాఫీగా సాగిన కార్మిక సంఘాల సమ్మె...

హైదరాబాద్, జనవరి 9‌: 2018 ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపినిచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు మంగళవారం రాష్ట్రంలో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రజా జీవనానికి కూడా ఎటువంటి అంతరాయం కలగలేదు. దీంతో కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె తెలంగాణలో పాక్షికంగా జరిగింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ బస్సులు, ఆటోలు యధావిధిగా నడిచాయి. మహాత్మా గాంధీ బస్‌ స్టాండ్‌ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులన్నీ తిరిగాయి. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింరేణిలో సమ్మె ప్రభావం ఏమాత్రం లేదు. యధావిధిగా కార్మికులు విధులకు హాజరయ్యారు. ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపో ముందు ఎంప్లాయిస్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు.

తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ సమ్మెకు మద్దతు తెలిపినప్పటికీ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపింది. బిజెపి అనుబంధ యూనియన్‌ మినహా మిగిలిన యూనియన్లు సమ్మెకు మద్దతు తెలిపాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు సైతం కార్యకలాపాలను నిర్వహించాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ సమ్మెలో పాల్గొన లేదు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం సమ్మెలో పాల్గొన్నా అధికారులు వచ్చి విధులను నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ సమ్మెలో పాల్గొన లేదు. విద్యుత్‌ విభాగాలైన ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. మున్సిపల్‌ కార్మికులు సైతం విధుల్లో పాల్గొన్నారు. కాగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ కార్మిక సంఘాల నేతలు సమావేశమై ఆందోళన చేశారు.

కార్మికులు, ఉద్యోగుల కనీస సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని, పదవీ విరమణ బెనిఫిట్స్‌, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కార్మికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్న 279 జిఓను రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.





Untitled Document
Advertisements