ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్‌

     Written by : smtv Desk | Wed, Jan 09, 2019, 12:27 PM

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్‌

నెల్సన్‌ (న్యూజిలాండ్‌), జనవరి 9: మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ 115 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని చిత్తుగా ఓడించింది. మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్‌, శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. టాస్‌ గెలిచి లంక ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 364 పరుగులు చేసింది. రాస్‌ టేలర్‌ (131 బంతుల్లో 137; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), హెన్రీ నికోల్స్‌ (80 బంతుల్లో 124 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శ్రీలంక బౌలర్ల పై సెంచరీలతో విజృంభించారు. కెప్టెన్‌ విలియమ్సన్‌ (65 బంతుల్లో 55; 6 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీ చేశాడు. టేలర్‌ మూడో వికెట్‌కు విలియమ్సన్‌తో 116 పరుగులు, నాలుగో వికెట్‌కు నికోల్స్‌తో 154 పరుగులు జోడించాడు. రాస్‌ టేలర్‌ కెరీర్‌లో ఇది 20వ వన్డే సెంచరీ, హెన్రీ నికోల్స్‌ కు వన్డే క్రికెట్ లో మొదటి శతకం. శ్రీలంక కెప్టెన్‌ లసిత్‌ మలింగ 10 ఓవర్లలో 93 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.4 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. తిసారా పెరీరా (63 బంతుల్లో 80; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా సహచరుల నుంచి సహకారం కరువైంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ (4/40), ఇష్‌ సోధి (3/40) రాణించారు. ఇరు జట్ల మధ్య ఏకైక టి20 శుక్రవారం జరుగుతుంది.

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా న్యూజిలాండ్‌ గుర్తింపు పొందింది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ మొత్తం 1054 పరుగులు (371/7; 319/7; 364/4) సాధించడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు భారత్‌ (2017లో ఇంగ్లండ్‌పై 1053 పరుగులు; 356/7; 381/6; 316/9;) పేరిట ఉండేది.





Untitled Document
Advertisements