ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ క్రికెటర్లదే హవా

     Written by : smtv Desk | Wed, Jan 09, 2019, 03:12 PM

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ క్రికెటర్లదే  హవా

దుబాయ్, జనవరి 9: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో హవా కొనసాగుతున్నది. ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయంలో కీలకమైన క్రికెటర్లు తాజా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 922 పాయింట్లతో బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. భారత సుదీర్ఘ కలను సాకారం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన చతేశ్వర్ పుజార 881 పాయింట్లతో ఒక ర్యాంక్ మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో మూడు సెంచరీల సహాయంతో పుజార 521 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. మిగతా బ్యాట్స్‌మెన్ విషయానికొస్తే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(488) ఆరు ర్యాంక్‌ల మెరుగుతో 57వ ర్యాంక్‌కు చేరుకోగా, ఐదు ర్యాంక్‌లు వెనుకబడిన యువ ఓపెనర్, భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్(472) 62వ ర్యాంక్‌లో నిలిచాడు.

బౌలింగ్ విషయానికొస్తే, 21 వికెట్లతో జట్టు సిరీస్ విజయంలో కీలకమైన స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా(711) 16వ ర్యాంక్‌లో నిలువగా, మహ్మద్ షమీ(660)కి 22వ ర్యాంక్ దక్కింది. సిడ్నీ టెస్ట్‌లో ఐదు వికెట్లతో రాణించిన కుల్దీప్ యాదవ్(402) ఏడు ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని కెరీర్‌లో అత్యుత్తమంగా 45వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

భారత యువ వికెట్‌ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ పరుగుల వేటలోనే కాదు ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. పుజార తర్వాత ఆసీస్‌తో సిరీస్‌లో అత్యధిక పరుగులు(350) చేసిన పంత్ ఏకంగా 21 ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 673 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో నిలిచాడు.

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న భారత్ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులేదు. 116 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నది. సొంతగడ్డపై భారత్‌కు తొలిసారి సిరీస్ చేజార్చుకున్న ఆసీస్ ఒక పాయింట్ కోల్పోయి 101 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నది.





Untitled Document
Advertisements