మోడీకి ముగ్గురు మహిళలు పోటి

     Written by : smtv Desk | Sat, Feb 02, 2019, 08:07 PM

మోడీకి ముగ్గురు మహిళలు పోటి

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల బరిలో ముగ్గురు మహిళలను ఎదుర్కొనున్నారు. సామాన్యంగా చదువు, ఉద్యోగం నుంచి రాజకీయాలవరకు ఇలా అన్ని రంగాల్లో మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. ఇక రాజకీయంగా చూస్తే ముగ్గురు మహిళలు ప్రధాని నరేంద్ర మోడీకి నిద్రపట్టకుండా చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ వంటి నేతలతో పోటీ పడిన మోదీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బలమైన ముగ్గురు మహిళా నేతలను ఢీకొననున్నారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ప్రియాంక గాంధీలు ఎన్నికల రంగంలో మోదీకి సవాలు విసురుతున్నారు.

ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండగా, రెండో సారి కూడా అధికారం లోకి రావాలని బీజేపీ యత్నిస్తోంది. మోడీ కలలకు ఈ ముగ్గురు మహిళల నుంచి ప్రమాదం పొంచి ఉందనే ప్రచారం బీజేపీలో జరుగుతోంది. ఆ ముగ్గురు మహిళలు వొకే వర్గం వారు కాదు. కాని సొసైటీలో వొకొక్కరూ వొక్కో స్థానంలో ఉన్నారు. ఇంతకీ ఆ మహిళలు ఎవరంటే వొకరు ప్రియాంకా గాంధీ వాద్రా. మరొకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంకొకరు బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి.

*ప్రియాంకా గాంధీ

ప్రియాంకా గాంధీ... గాంధీ కుటుంబానికి చెందిన మహిళ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక గాంధీ కుటుంబమే దేశాన్ని చాలా ఏళ్లు పాలించింది. జనవరిలో ప్రియాంకా గాంధీ పొలిటికల్ ఎంట్రీ ఖరారైంది. దీంతో ఉత్తర్ ప్రదేశ్‌ రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలో నిర్ణయించగలిగే శక్తి ఆ రాష్ట్రానికి ఉంది. ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిలు ఎలాగైనా సరే కేంద్రంలో ఎన్డీఏ కూటమి రాకుండా విపక్షాలతో కలిసి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య ఇంకా ఎలాంటి అధికారిక అవగాహన లేదు. ఎన్డీఏ కంటే విపక్ష పార్టీల్లోనే ఎక్కువమంది మహిళా నేతలున్నారని వారు మంచి ఓటు బ్యాంకును ఏర్పాటు చేయగలరని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. మూడు ముఖ్య రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చూశాకా వారిలో వొక భయం ఏర్పడిందన్నారు యశ్వంత్ సిన్హా. ఇక ప్రియాంకా గాంధీని ఇందిరతో పోల్చి చూస్తుండటంతో ఇటు క్యాడర్‌లో జోష్ పెరిగిందని చెప్పొచ్చు. ఓటర్లు కూడా ప్రియాంకా గాంధీ నాయకత్వం వైపు మొగ్గు చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

*మాయావతి

ఇక మమతా బెనర్జీ, మాయావతిలకు ప్రియాంకాగాంధీ కంటే రాజకీయంగా ఎక్కువ అనుభవం ఉంది. వొకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఇద్దరు ప్రధాని రేసులో ఉండే అవకాశం ఉంది. వొక సాధారణ టీచర్ నుంచి వొక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాయావతి ఎదిగారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రిగా ఉన్న మాయావతి దళిత సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలోని దళితులను, ఇతర అణగారిన వర్గాల వారిని వొక్కతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు మాయావతి. ఇక గత నెలలో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని సంచలనానికి తెరదీశారు. సమాజ్ వాదీ పార్టీకి కూడా ఇతర వర్గాలు, ముస్లిం సామాజిక వర్గాల ఓటు బ్యాంకు ఉంది.

*మమతా బెనర్జీ

మరోవైపు మమతా బెనర్జీ 1997లో కాంగ్రెస్‌ను వీడి సొంత కుంపటి పెట్టుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకుని ఎట్టకేలకు ఆమె బెంగాల్‌లో అప్పటి వరకు ఏలుతున్న కమ్యూనిస్టుల పీటం కదిలించారు. ఆ తర్వాత సీఎం పీటంపై దీదీ కూర్చున్నారు. ఇలా ఆమె బలం ఏమిటో తెలుస్తోంది. అంతేకాదు జనవరిలో విపక్షాలతో కలిసి ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సభ సక్సెస్ కావడంతో బీజేపీలో ఆందోళన ప్రారంభమైంది. తాము ఇలాంటి సభలకు భయపడేది లేదని బయటకు చెబుతున్న లోపల మాత్రం కమలం పార్టీకి కలవరం మొదలైందనే మాట వినిపిస్తోంది. తాము కేవలం ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిపైనే ఓట్లు అడుగుతామని కమలనాథులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements