స్టీల్ ధరలు పెంపు..

     Written by : smtv Desk | Fri, Feb 08, 2019, 08:25 PM

 స్టీల్ ధరలు పెంపు..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 08: ఈ నెల మొదటి వారం నుండి స్టీల్ రేట్లు టన్నుకు రూ.750 వరకూ పెంచినట్టు స్టీల్ కంపెనీల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన డిమాండ్ నేపధ్యంలో మన దగ్గర కూడా ఉక్కు ధరలు అనూహ్యంగా పెరిగాయి అని పలు వర్గాల విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టన్ను ఉక్కు ధర రూ.42-44 వేల మధ్య ఉంది. దీనికి అదనంగా ధరలు పెరిగాయి. ధరలు పెంచిన కంపెనీల్లో ప్రముఖంగా జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం, సెయిల్ వంటి సంస్థలు ఉన్నాయి.

ముడి ఉక్కు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయి. గ్లోబల్ స్టీల్ ధరలు టన్నుకు 40 డాలర్ల వరకూ ఎగబాకడంతో మన దగ్గర కూడా రేట్లు పెంచాల్సి వచ్చిందని కంపెనీలు చెబ్తున్నాయి. వీటికి తోడు చైనాలో ఉక్కు ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల స్టీల్‌కు డిమాండ్ పెరిగి.. రేట్లు కొండెక్కాయి. అలాగే ప్రపంచంలోని ప్రధాన ముడి ఇనుము ఎగుమతిదారుల్లో ఒకటైన బ్రెజిల్ సంస్థలో ఓ ప్రమాదం సంభవించింది. దీంతో ఇవన్నీ వెరసి ఇంటర్నేషనల్ మార్కెట్లో స్టీల్ రేట్ల వృద్ధికి కారణమైంది. రాబోయే ఆరు నెలల పాటు గ్లోబల్ ట్రెండ్‌ను బట్టి చూస్తే రేట్లు తగ్గేట్టు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

ఇంటర్నేషనల్‌గా డిమాండ్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉందని, మన దగ్గర కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని చెబ్తున్నారు. వాస్తవానికి మన దేశంలో కూడా ఉక్కుకు డిమాండ్ బాగానే పెరుగుతోంది. కానీ రేట్లు మాత్రం ఆ స్థాయిలో లేవు. ఎందుకంటే ప్రముఖ ప్రభుత్వ మైనింగ్ సంస్థ ఎన్ఎండిసి ఐదు నెలల నుంచి రేట్లను తగ్గిస్తూ వస్తోంది. అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ 30 శాతం రేట్లలో కోత విధించింది. అంతేకాక చత్తీస్‌గఢ్‌లో చాలా మంది మైనింగ్ ఓనర్ల లైసెన్సులు ఈ ఏడాది ఆఖర్లో ముగియబోతున్నాయి. అందుకే వాళ్లు సాధ్యమైనంత ఎక్కువ ముడి ఇనుమును వెలికితీయాలని చూస్తున్నారు.

సరఫరా అధికంగా ఉండడం వల్ల కూడా మన దేశంలో గత కొద్ది నెలల నుంచి రేట్లు పెద్దగా పెరగలేదు. 2019లో మన దేశానికి 201.12 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ అవసరం. ఇక్కడి సంస్థలు 210 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేస్తున్నాయి. దీన్ని బట్టి మన దగ్గర సంతృప్తికర అధిక నిల్వలే ఉన్నాయి కాబట్టి భారీగా రేట్లు పెరిగే అవకాశం తక్కువ. నాలుగు నెలలుగా రేట్లు పెరగకపోవడం వల్ల ఇప్పుడు టన్నుకు రూ.750 వరకూ పెంచారు. రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా పెంచొచ్చు కానీ అంతకు ముందు భారీగా ధరలు పెరిగే సీన్ లేదని స్పష్టంగా చెబ్తున్నారు.

Untitled Document
Advertisements