ఇండియాకి వార్నింగ్‌ ఇచ్చిన చైనా.. బదులిచ్చిన భారత్!

     Written by : smtv Desk | Sat, Feb 09, 2019, 09:33 PM

ఇండియాకి వార్నింగ్‌ ఇచ్చిన చైనా.. బదులిచ్చిన భారత్!

ఈటానగర్‌, ఫిబ్రవరి 9: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చేపట్టిన అరుణచల్‌ ప్రదేశ్‌ పర్యటన వివాదాస్పదంగా మారింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కొరకు ప్రధాని మోదీ ఈరోజు అక్కడ పర్యటించారు. కాగా దీనిపై సరిహద్దు దేశం అయిన చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదాస్పద భూభాగంలో భారత ప్రధాని మోదీ పర్యటించారని ఇటువంటి చర్యలకు దిగి సరిహద్దు సమస్యలను మరింత క్లిష్టతరం చేయొద్దని భారత్‌ను చైనా ప్రభుత్వం హెచ్చరించింది. ‘ద్వైపాక్షిక సంబంధాల నిబంధనలను దృష్టిలో ఉంచుకొని భారత్‌ ప్రవర్తించాలి. చైనా అభిప్రాయాలను గౌరవిస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. సరిహద్దు సమస్యలను వివాదం చేసే చర్యలకు భారత్‌ దూరంగా ఉండాలి’ అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చైనాకు ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా మోదీ పర్యటించన సమయంలో డ్రాగన్‌ ఇదేవిధంగా స్పందించింది. అలాగే బౌద్ధమత గురువు దలైలామా పర్యటించడాన్ని కూడా చైనా తప్పుబట్టింది. ఈ పర్యటన వల్ల సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చైనా వ్యాఖ్యానించింది. కాగా డ్రాగన్‌ ప్రకనటపై భారతదేశ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అరుణాచల్ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమేనని, భారత నేతలు పర్యటించి తీరుతారని కౌంటరిచ్చింది. ఇదే విషయాన్ని గతంలో అనేక సార్లు చైనాకు స్పష్టంగా చెప్పినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.





Untitled Document
Advertisements