తెలంగాణ లోక్ సభ బరిలో జనసేన....ఆ పార్టీల సహకారంతో

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 08:39 AM

తెలంగాణ లోక్ సభ బరిలో జనసేన....ఆ పార్టీల సహకారంతో

హైదరాబాద్, ఫిబ్రవరి11: రానున్న లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా తమ పార్టీని బరిలోకి దించడానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ లోకసభ ఎన్నికల్లో మాత్రం తన పార్టీ అభ్యర్థులను పోటీకి దించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

నల్లగొండ, మెదక్, భువనగిరి, వరంగల్ లోకసభ సీట్లకు పవన్ కల్యాణ్ ఆదివారం పార్లమెంటరీ కమిటీలను వేశారు. సికింద్రాబాద్, ఖమ్మం, మల్కాజిగిరి పార్లమెంటరీ కమిటీలను ఆయన ఇది వరకే ఖరారు చేశారు.

శాసనసభ ఎన్నికల్లో కొన్ని సీట్లకు పోటీ చేయాలని జనసేన 2018 అక్టోబర్ లో నిర్ణయించింది. అయితే, శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ నవంబర్ లో ప్రకటించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇది వరకే ఓ సారి అన్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకసభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కల్యాణ్ వామపక్షాలతో పొత్తులకు సిద్ధపడ్డారు. తెలంగాణలో కూడా ఆ పార్టీల సహకారంతో పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

Untitled Document
Advertisements