45 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగిత రేటు నమోదు: రాహుల్ గాంధీ

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 09:28 AM

45 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగిత రేటు నమోదు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం తీవ్ర విమర్శలు చేసారు. ప్రభుత్వ అసమర్థత, దివాళాతనానికి ఈ పరిస్థితి అద్దం పడుతుందని రాహుల్‌ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేకపోయిందని లక్షల పెట్టుబడి తరువాత తాను ఒక ఉద్యోగాన్ని పొందానని ఒక ఉబెర్‌ డ్రైవర్‌ వ్యాఖ్యానించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను రాహుల్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఓలా, ఉబెర్‌లు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాయని నీతి అయోగ్‌ తన నివేదికలో వెల్లడించడంపై అడిగిన ప్రశ్నకు డ్రైవర్‌ ఈ విధంగా సమాధానమిచ్చాడు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మోడీ నెరవేర్చలేకపోయారన్నారు. గడిచిన 45 ఏళ్లలో 2017-2018 సంవత్సరంలో నమోదైన నిరుద్యోగిత రేటు 6.1 అత్యధికమని నివేదిక పేర్కొంది.

ఈ 45 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగిందని నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఒ) వెల్లడించిన నివేదిక ఆధారంగా ఎన్‌డిఎ ప్రభుత్వంపై రాహుల్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్వేను ఇంకా ఖరారు చేయలేదని ప్రభుత్వం వెల్లడించింది.





Untitled Document
Advertisements