కారణం చెప్పకుండా తొలగించినందుకు హెరిటేజ్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఆత్మహత్య

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 12:26 PM

కారణం చెప్పకుండా తొలగించినందుకు హెరిటేజ్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఆత్మహత్య

అమరావతి, ఫిబ్రవరి 11: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరానికి చెందిన గంగినేని హరిబాబు (48) 2012లో హెరిటేజ్‌కు చెందిన పాలు, సంబంధిత పదార్థాల సీ అండ్‌ ఎఫ్‌(కారీయింగ్‌ అండ్‌ ఫార్వార్డింగ్‌) డిస్ట్రిబ్యూటర్‌గా చేరాడు. రూ. 2.8 లక్షలు డిపాజిట్‌ కూడా చేశాడు. కాగా ఆదివారం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను ఆ కంపెనీ నుండి అకారణంగా తొలగించడంతో అతను అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఒంగోలు నగరంలో నివాసముంటున్న హరిబాబు, కంపెనీ తనకు సరఫరా చేస్తున్న పాలు ఇతర పదార్థాలను ఏజెంట్లకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హరిబాబుకు జనవరి 5న కంపెనీ నుండి, అదనంగా డిపాజిట్‌ చెల్లించకపోవడం తదితర కారణాలతో పాల పదార్థాల సరఫరా నిలిపివేస్తున్నట్టు మెయిల్‌ వచ్చింది. ఆ కంపెనీ పెద్దలను బతిమాలుకున్నా ఫలితం లేకపోవడంతో మర్నాడే నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు లేఖ రాశాడు.

తనను ఆపేస్తే ఆర్థికంగా ఇబ్బందిపడతానని లెటర్‌లో వేడుకున్నాడు. ఇతర కంపెనీలతో పోల్చితే హెరిటేజ్‌లో తక్కువప్రోత్సాహకం ఇస్తున్నా టీడీపీపై అభిమానంతోనే పనిచేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆ ఉత్తరానికి కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బకాయిలు ఆగిపోవటం, డిపాజిట్‌ వెనక్కు ఇవ్వకపోవడంతో బయట ముఖం చూపించలేకపోతున్నానని, ఆత్మహత్యే శరణ్యమని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.

కంపెనీ తనను తీసేయడంతో అప్పుల పాలై చివరికి తన 3.5 ఎకరాల పొలం అమ్మి కొంత వరకు బాకీలు తీర్చాడు. ఈ నేపథ్యంలో శనివారం తన గ్రామానికి చేరుకున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉండడంతో బంధువులు అద్దంకిలోని ఆస్పత్రికి తరలించరు.

కానీ అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. ఘటనాస్థలంలో లభించిన ఆనవాళ్లను బట్టి మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దీని పట్ల పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.

Untitled Document
Advertisements