దాడికి 2 రోజులముందు ట్విట్టర్ లో ఈ వీడియో హల్‌చల్‌

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 03:10 PM

దాడికి 2 రోజులముందు ట్విట్టర్ లో ఈ వీడియో హల్‌చల్‌

జమ్మూ కాశ్మీర్, ఫిబ్రవరి 15: గురువారం జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామలో జవాన్ల పై జరిగిన ఉగ్రవాదుల దాడి గురించి పలు సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఈ దాడికి పాక్ ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు ముందుగానే హెచ్చరించినట్టు సమాచారం. ఈ దాడి జరగడానికి రెండు రోజుల క్రితం ట్విట్టర్ లో ఓ వీడియో హల్‌చల్‌ చేసింది. ఇది గమనించిన జమ్ము కాశ్మీర్‌ పోలీసులు ఇంటెలిజెన్స్‌ వర్గాలకు ముందే చెప్పినట్లు తెలుస్తోంది.

ఓ ప్రైవేట్‌ ట్విటర్‌ ఖాతాలో ఆత్మాహుతి దాడికి సంబంధించిన 33 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియో రెండు రోజుల క్రితం ట్విటర్‌లో కనిపించింది. అందులో సోమాలియా భద్రతా సిబ్బందిపై జేఈఎం ఉగ్రవాదులు దాడి చేసినట్లుగా కనిపిస్తుంది. అందులో కాశ్మీర్‌లోనూ ఇదే తరహా దాడి జరగబోతుంది అని సందేశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ట్విటర్‌ ఖాతాను ఎక్కడి నుంచి ఆపరేట్‌ చేస్తున్నారనేది కనిపెట్టేందుకు భద్రతా ఏజెన్సీలు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు.

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణి మీద ఎలా అయితే దాడి జరిగిందో అలాగే ఈ వీడియోలో సోమాలియా సిబ్బందిపై దాడి చేసినట్లు ఉంది. ఈ వీడియోను పరిశీలించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉన్నట్లు ముందుగానే అనుమానించారు. ఈ నేపథ్యంలోనే సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

అంతేకాక ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు ఏడాది ముందు నుంచే ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ వాహనంలో పేలుడు పదార్థాలతో దాడి చేయాలని ఉగ్రవాదులు ప్లాన్‌ వేశారట. దీనిపై రెండు ఉగ్రవాద సంస్థలు పని చేసినట్లు సమాచారం. 2001లో కశ్మీర్‌ అసెంబ్లీ వద్ద ఏ విధంగా అయితే పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో వెళ్లి ఆత్మాహుతి దాడి చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా చేయాలని జైషే ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements