'జైషే మొహమ్మద్'....దీని వెనక దాగున్న అసలు కథ ఇదే!!

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 04:36 PM

'జైషే మొహమ్మద్'....దీని వెనక దాగున్న అసలు కథ ఇదే!!

పాకిస్తాన్, ఫిబ్రవరి 15: భారత్ లో ఎప్పుడు ఎక్కడ ఉగ్రవాదుల దాడి జరిగినా ప్రధానంగా తెరపైకి వచ్చే ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్. గురువారం కాశ్మీర్ లోని పుల్వామలో జవాన్ల పై జరిగిన దాడిలో ప్రధాన పాత్ర పోషించింది తామేనని పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రకటించడంతో ఆ సంస్థ ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది.

భారత్ అంటే విద్వేషం, కశ్మీర్‌ ను భారత్ నుంచి విడగొట్టి పాక్‌లో కలపాలన్న లక్ష్యంతో పురుడు పోసుకున్న ఈ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్. రక్తం తాగే నరరూప రాక్షసుడైన ఇతని రాక్షస చరిత్ర ఒక్కసారి గమనిస్తే..... మౌలానా మసూద్ అజహర్ పాకిస్తాన్‌లోని పంజాబ్ బహవల్‌పూర్‌లో జన్మించాడు.

తండ్రి అల్లా బకాష్ షబ్బీర్ ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసేవాడు. డైరీ, కోళ్ల పెంచే వృత్తితో వీరి కుటుంబం జీవనం సాగిస్తోంది. 21 ఏళ్ల వయసులో హర్కాత్ ఉల్ ముజాహుద్దీన్ నాయకుల ప్రభావంతో జిహాద్ ఆకర్షితుడై ఉగ్రవాదం వైపు వెళ్లాడు. దీనిలో భాగంగా ఆఫ్గన్‌లోని యువార్ టెర్రరిస్ట్ క్యాంపులో శిక్షణ పొందాడు.

అయితే నైపుణ్యం సంపాదించకపోవడంతో అక్కడి టెర్రరిస్టు గ్రూప్ మసూద్‌ను కరాచీ తిప్పి పంపింది. అనంతరం ఉపాధ్యాయుడిగా మారి మత బోధనలు చేస్తూ, ఓ వారపత్రికను నడిపేవాడు. జర్నలిస్టుగా తిరుగుతూ.. 1994లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి భద్రతా దళాల చేతికి చిక్కాడు. అక్కడ శిక్ష అనుభవిస్తుండగా 1999లో పాక్ ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ విమానాశ్రయానికి తరలించారు.

విమానంలో ఉన్న 155 మంది ప్రయాణికులు బందీలుగా చిక్కడంతో ఉగ్రవాదుల డిమాండ్లకు తలొగ్గిన భారత ప్రభుత్వం మసూద్‌తో పాటు మరో ఇద్దరు కరడు గట్టిన ఉగ్రవాదులను విడుదల చేసింది. భారత్ అంటే వ్యతిరేకత ఉన్న మసూద్ మనదేశంలో విధ్వంసం సృష్టించడానికి ‘‘జైష్ ఏ మొహమ్మద్’’ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు.

మత ప్రచారంతో పాటు యువతలో భారత వ్యతిరేకతను నింపేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో అజార్ దిట్ట. 2001లో పార్లమెంట్‌పై దాడితో జైషే మొహమ్మద్ సంస్థ వెలుగులోకి వచ్చింది. దానితో పాటు తన సహచరుడు ఒమర్ షేక్‌తో కలిసి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తున్నాడు.

భారత్‌తో పాటు పలు నిఘా సంస్థల నుంచి ముప్పు పొంచి వుండటంతో అతను తన స్వగ్రామం బహవల్ పూర్‌లో గడిపాడు. భారత్‌తో పాటు ప్రపంచదేశాల ఒత్తడి మేరకు పాక్ ప్రభుత్వం మసూద్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది.





Untitled Document
Advertisements