భారత్ సత్తా ఏంటో చూపాలి: పుల్వామా దాడిపై పారిశ్రామికవేత్తలు

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 04:34 PM

భారత్ సత్తా ఏంటో చూపాలి:  పుల్వామా దాడిపై పారిశ్రామికవేత్తలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: జమ్ముకాశ్మీర్ పుల్వామా జిల్లలో జరిగిన ఉగ్రదాడిపై భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారతదేశ సత్తా ఏంటో వారికి చూపాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ దాడిపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ...‘

ప్రతి విషయాన్ని చాలా సాధారణంగా భావించి సమాజం ముందుకెళ్తోంది. కానీ ఈ ఉగ్ర దాడి మన భ్రమల్ని చెరిపేసింది. ఈ దాడి చాలా మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల ప్రాణాలను బలిగొంది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు.

ఇక జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్‌ జిందాల్ మాట్లాడుతూ... ‘జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి పార్లమెంటు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి. మన దేశాన్ని ఎవరూ కలవరపాటుకు గురి చేయలేరన్న విషయాన్ని ఇప్పుడు ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఏ రకంగానైనా మన దేశంపై దాడులు చేస్తే మనం కూడా నిర్ణయాత్మక అడుగులు వేయాల్సిన అవసరం ఉంది’అని స్పష్టం చేశారు.

అలాగే జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ అధినేత నవీన్‌ జిందాల్ స్పందిస్తూ... ‘ప్రతి భారతీయుడు ఇప్పుడు తమ జాతీయ భావాన్ని చాటుకునేందుకు ముందుకు రావాలి. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలవాల్సిన అవసరం ఉంది’అని పిలుపునిచ్చారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రమోటర్ సుభాష్‌ చంద్ర మాట్లాడుతూ... ‘పొరుగు దేశంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డ ప్రతిసారీ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే అవకాశం ఉంటుందని మనం నమ్ముతున్నాం. కానీ అది తప్పు అని వారు ప్రతిసారీ రుజువు చేస్తున్నారు. బహుశా పాకిస్థాన్‌కు ఎప్పటికీ శాంతి అనే భాష బోధపడదేమో’అని వ్యాఖ్యానించారు.

ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత హర్ష్‌ గోయెంకా ఈ సందర్భంగా ప్రతిస్పందిస్తూ...‘ఉగ్రదాడిపై భారత్‌ తక్షణమే స్పందించాలి. పాకిస్థాన్‌ను ఉపేక్షించకూడదు. వచ్చే వారం మన సైనిక ప్రతిస్పందన కచ్చితంగా ఉంటుందని నేను నమ్ముతున్నా. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై పోరాడేందుకు మనమందరం ఏకతాటిపైకి రావాలి’అని పిలుపునిచ్చారు.





Untitled Document
Advertisements