భారత్‌లో ఎన్నికల సమయం కనుక మమ్మల్ని నిందిస్తున్నారు : పాక్ ప్రధాని

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 04:22 PM

భారత్‌లో ఎన్నికల సమయం కనుక మమ్మల్ని నిందిస్తున్నారు : పాక్ ప్రధాని

లాహోర్‌, ఫిబ్రవరి 19: ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. జమ్మూకాశ్మిర్ లోని పూల్వమాలో సూసైడ్ బాంబర్ ఆదిల్ అహ్మద్ సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 43 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఇప్పుడు ఆ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. భారత్ ఎలాంటి ఆధారాలు లేకుండా తమను నిందిస్తుందని ఆరోపించారు. ఈ ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఇమ్రాన్‌ స్పందించారు. భారత్‌ వద్ద సాక్ష్యాలు ఉంటే చూపించాలని, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అయితే తమ దేశం కూడా ఉగ్రవాదుల వల్ల బాధపడుతుందని, ఉగ్రకార్యకలాపాలతో తాము కూడా ఇబ్బందుల ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ఉగ్రదాడి దర్యాప్తులో భారత్‌కు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఉగ్రవాదంపై చర్చలకు పాక్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. కాగా కాశ్మీర్‌ సమస్య సైనిక చర్యతో పరిష్కారం అవ్వదని, చర్చలతోనే ఈ వివాదాన్ని పరిష్కరించాలన్నారు. అలాగే భారత్‌ తమపై దాడికి పాల్పడితే దీటుగా ఎదుర్కొంటామన్నారు. భారత్‌లో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఈ ఉగ్రదాడి విషయంలో పాక్‌ను నిందిస్తున్నారని అన్నారు.





Untitled Document
Advertisements