జర భద్రం! ఈరోజు నుంచే అమలు..

     Written by : smtv Desk | Tue, Aug 01, 2017, 11:03 AM

జర భద్రం! ఈరోజు నుంచే అమలు..

హైదరాబాద్, ఆగష్టు 1 : హైదరాబాద్ మహా నగరంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో సుమారు 1000 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం. ఈ సమస్యకి పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మీరు బయటికి వెళ్ళడానికి కారు, లేదంటే బైక్‌మీద బయల్దేరుతున్నారా? అయితే జాగ్రత్త! వెళ్లే ముందు వాహనాలకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు, బైక్‌ నడుపుతుంటే హెల్మెట్, ఫోర్‌ వీలర్‌ అయితే సీట్‌బెల్ట్‌ ధరించడం మరువద్దు. అన్నింటికన్నా ముందు లైసెన్స్‌ను తీసుకెళ్లడం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో పెనాల్టీ పాయింట్స్ సిస్టం ఈరోజు నుంచే అమలులోకి రానుంది. దేశంలోనే తొలిసారి ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ సంయుక్తంగా ఈ పెనాల్టీ పద్ధతిని అమలు చేయనున్నట్లు నగర ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ వి.రవీందర్‌ తెలిపారు. దీని గురించి ఒక ఇరవై రోజులు వాహనదారులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

పెనాల్టీ పాయింట్స్ ఈ విధంగా ఉన్నాయి..

*సీట్ బెల్ట్/హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే -1
*ఆటోలో ముందు సీట్లో ప్రయాణికులను కూర్చోబెడితే -1
*వేగ పరిమితి ఉన్న మార్గంలో 40 స్పీడ్ దాటితే- 2
*సిగ్నల్ జుంపింగ్&జిగ్ జాగ్ డ్రైవింగ్ -2
*ఇన్సూరెన్స్ లేకుండా నడిపితే -2
*సరుకులు రవాణా చేసే గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులుంటే-2
*మద్యం మత్తులో 2,4 వీలర్ నడిపితే -3
*మద్యం మత్తులో రవాణా వాహనాలను నడిపితే -3
*రేసింగ్/ట్రయల్ స్పీడ్ వెహికిల్ నడిపితే -3
*మద్యం మత్తులో గూడ్స్ కెరియర్/లారీ నడిపితే - 4
*క్యాబ్స్, బస్సు, ఆటో డ్రైవర్స్ డ్రంక్&డ్రైవ్ చేస్తే-5
*304 (ఏ) ఐసీసీ/304 కేసులు నమోదైతే- 5
*చైన్ స్నాచింగ్, దోపిడీ తదితర నేరాలకు వాహనం ఉపయోగిస్తే -5

ఈ విధంగా పాయింట్లను నిర్దారించారు. 24 నెలల్లో 12 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ దాటితే ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. లైసెన్స్ రద్దయిన సమయంలో వాహనాన్ని నడిపితే జైలుకు వెళ్ళవలసి ఉంటుందని హెచ్చరించారు. రెండోసారి 12 పాయింట్స్ దాటితే రెండేళ్ళు, మూడోసారి మూడేళ్ళపాటు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ఆ పాయింట్స్ ను పకడ్బందీగా లెక్కించుటకు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను కూడా రూపొందించినట్లు కమీషనర్ మహేందర్ రెడ్డి వివరించారు.





Untitled Document
Advertisements