తారక్ తో సినిమా చేస్తానని అనుకోలేదు : రామ్ చరణ్

     Written by : smtv Desk | Thu, Mar 14, 2019, 03:54 PM

తారక్ తో సినిమా చేస్తానని అనుకోలేదు : రామ్ చరణ్

హైదరాబాద్ , మార్చ్ 14: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళితో కలిసి మళ్లీ తాను పని చేయాలనుకున్నాను కానీ, తారక్‌తో కలిసి ఆయనతో సినిమా చేస్తానని తాను అనుకోలేదని మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అన్నారు. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. గురువారం ఈ సినిమా విశేషాలను వెల్లడించారు. ‘ఇది నిజంగా జరుగుతోందా లేదా అన్నది కూడా ఇంకా నమ్మలేకపోతున్నాను. రాజమౌళితో మళ్లీ పనిచేయాలనుకున్నాం. కానీ తారక్‌తో కలిసి ఆయనతో సినిమా చేస్తానని అనుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌ ఎలా మొదలైందనేది నా ఆసక్తి. ఒకరోజు ఊరువెళ్తున్నప్పుడు ఆయన ఇంటికి రమ్మన్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లగానే ఒక మంచి పోజ్‌లో తారక్‌ కింద నేల మీద రిలాక్స్‌ అయి కూర్చున్నారు. తారక్‌కు నేనొస్తానని తెలీదు. నాకూ తనొస్తాడని తెలీదు. అలా ఇద్దరం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. మా ఇద్దర్నీ లోపలికి తీసుకెళ్లి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ గురించి చెప్పారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇద్దరం ఆయన్ను కౌగిలించుకుని ధన్యవాదాలు చెప్పాం. ఆ తర్వాత తీసిన ఫొటోనే మీరు చూశారు. అద్భుతమైన, గౌరవప్రదానమైన పాత్రల్లో నటిస్తున్నాం. మేం కూడా చాలా జాగ్రత్తగా నటిస్తున్నాం. నా సోదరుడు తారక్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇంకా మా పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ మొదలుకాలేదు.’ అని అన్నారు.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇదో ఉత్తమ చిత్రం అవుతుందని అన్నారు. ‘ఈరోజు చాలా టెన్షన్‌గా ఉంది. ఇది జక్కన్నతో నాలుగో చిత్రం నాది. అన్నింటికంటే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఫీలవుతున్నాను. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా మిగిలిపోతుంది, ఎందుకంటే జక్కన్నతో పనిచేయడం దాంతో పాటు చరణ్‌తో కలిసి తెరపంచుకోబోతున్నాను. మా ఇద్దరి స్నేహం ఈ సినిమాతో మొదలవ్వలేదు. నాకు తెలిసిన మంచి మిత్రుడు. నా కష్ట సుఖాలు పంచుకునే మిత్రుడు చరణ్‌. ఈ సినిమా మేం కలిసి చేసేసరికి వేరే లెవల్‌కు వెళ్లిపోయింది మా స్నేహం. మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే స్నేహితులుగా మిగిలిపోవాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. మాకు ఎలాంటి దిష్టి తగలకూడదు. అల్లూరి, భీం గురించి తెలిసిన గీత ఒకటి ఉంది. ఇప్పుడు వారిద్దరూ మనకు తెలీని గీత గురించి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో చూస్తారు. ఈ సినిమా నాకు, చరణ్‌కు నటులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ సినిమా ప్రారంభించడానికి ముందు మేం చేసిన వర్క్‌ షాప్స్‌, శిక్షణ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు చేసిన 28 సినిమాల కంటే ఈ సినిమా కోసం తీసుకున్న శిక్షణ మా భవిష్యత్‌ సినిమాలకు ఎంతో సహాయపడుతుందని చెప్పగలను. మేం తీసుకున్న శిక్షణ వర్ణనాతీతం. రాజమౌళి బుర్రలో పుట్టిన ఈ ఆలోచన ఓ గొప్ప చిత్రంగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. నటులుగా ఈ చిత్రంలో మేం పాల్గొనడం మా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు జక్కన్నకు ధన్యవాదాలు. ఈ సినిమాలో ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎటువంటి విభేదాలూ లేకుండా చరణ్‌ ఒప్పుకొన్నందుకు హ్యట్సాఫ్‌ చెప్పాలి. మా తరంలో ఈ సినిమా రాబోతోందని చాలా సంతోషంగా ఉంది. అది కేవలం జక్కన్నపై మాకున్న కాన్ఫిడెన్స్‌ వల్లే అవబోతోంది’ అని అన్నారు. కాగా ఈ చిత్రంలో అలియా భట్‌, సముద్రఖని, అజయ్‌దేవగణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.





Untitled Document
Advertisements