రైల్వే ప్రయాణికులకు శుభవార్త

     Written by : smtv Desk | Tue, Mar 19, 2019, 01:16 PM

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

న్యూ ఢిల్లీ , మార్చ్ 19:మన భారత రైళ్లు ఎప్పుడూ ఆలస్యమే... టైముకి రానే రావు అని మనం ఎన్నిసార్లు అనుకొని ఉంటామో. ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే త్వరలో రైల్ ఫ్లైఓవర్లను నిర్మించబోతోంది. ప్రీమియం ట్రైన్స్ అయిన రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణించేవారు సైతం... ట్రైన్స్ ఆగిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ సమస్యకు చెక్ పెడతామంటోంది ఇండియన్ రైల్వేస్. ఇందుకోసం నిర్మించే ఫ్లైఓవర్ల వల్ల... రైళ్లు మధ్యలో ఆగకుండా డైరెక్టుగా ప్లాట్‌ఫామ్‌ చేరతాయని చెబుతోంది. ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే 250 రైల్వే జంక్షన్ల దగ్గర ఈ ఫ్లైఓవర్లను నిర్మిస్తామంటోంది.

ఫ్లైఓవర్లను ఎక్కడెక్కడ నిర్మించాలో రైల్వే అధికారులు ఇప్పటికే గుర్తించారు. రద్దీగా ఉండే చాలా రైల్వేస్టేషన్ల దగ్గర రెండేసి ట్రాక్సే ఉన్నాయి. అలాంటి చోట నిర్మించే ఫ్లైఓవర్ వల్ల... క్రాసింగ్ దగ్గర రైళ్లను ఆపాల్సిన అవసరం ఉండదు. తద్వారా రైళ్లు సమయానికి గమ్య స్థానాన్ని చేరగలవు.

రైళ్ల వేగాన్ని పెంచే చర్యలు కూడా తీసుకుంటున్నారు. క్రాస్ ఓవర్స్ దగ్గర ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగం ఉండగా... దాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పెంచుతున్నారు. ఐతే... ఇది అమల్లోకి రావాలంటే సిగ్నలింగ్ ప్రక్రియలో మార్పులు చెయ్యాల్సి ఉంటుంది.

2017లో 10 కిలోమీటర్ల పొడవైన రైల్వే ఫ్లైఓవర్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని ఇటావా దగ్గర నిర్మించాలనుకున్నారు. దీని వల్ల హౌరా-కాన్పూర్-న్యూఢిల్లీ, ఇటావా-భిండ్, ఆగ్రా-ఇటావా-మెయిన్‌పురి వెళ్లే రైళ్లు ఆలస్యం చెయ్యకుండా వెళ్లగలవు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.894 కోట్లు. దాన్ని 2020-21కల్లా పూర్తి చెయ్యాలనుకుంటుున్నారు. దేశంలో అత్యంత వేగంగా వెళ్లే వందే భారత్ ట్రైన్18, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ లాంటి మరిన్ని రైళ్లను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలున్నాయి. తద్వారా విమాన ప్రయాణాలకు ప్రత్యామ్నాయంగా రైళ్లను తేవాలనుకుంటున్నారు.





Untitled Document
Advertisements