ఆస్తుల అమ్ముకుంటే కానీ చదువుకోలేని పరిస్థితి : జగన్

     Written by : smtv Desk | Wed, Mar 20, 2019, 06:01 PM

ఆస్తుల అమ్ముకుంటే కానీ చదువుకోలేని పరిస్థితి : జగన్

ప్రకాశం, మార్చ్ 20: వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు బహిరంగ సభలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జాబు కావాలంటే బాబు రావాలన్నారు. మరీ, బాబు వచ్చాడు.. జాబు వచ్చిందా? ఇప్పుడు జాబు కావాలంటే బాబు పోవాలని జ‌గ‌న్ పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు ఇచ్చిన‌ హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా నెర‌వేర్చారా ? రుణాల మాఫీలేదు వడ్డీ లేని రుణాలు లేవు. సాగు నీరు తాగు నీరు లేదు. గిట్టుబాటు ధరలు లేవు. హెరిటేజ్‌ కోసం రాష్ట్ర రైతులను అమ్మేశాడు. ఆస్తుల అమ్ముకుంటే కానీ చదువుకోలేని పరిస్థితి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిర్వీర్యం చేశాడు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ కాలేదు అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు మరోసారి పసుపు- కుంకుమతో కొత్త సినిమాకు తెర‌తీశాడు. ఉపాధి అవకాశాలను చంద్రబాబు సర్వనాశనం చేశాడు. మోసం చేసేవారు మీకు నాయకులుగా కావాలా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. చంద్రబాబుకు అమ్ముడుపోయిన టీవీ ఛాన‌ళ్ల‌న్నింటితోనూ! వీళ్లంతా కలిసి ఎన్నికలు ముగిసే వ‌ర‌కు ప్రజలకు రోజుకో కొత్త‌ సినిమా చూపిస్తారు. ధర్మానికి అధర్మానికి జరగుతున్న ఎన్నికలివి. గుండెల మీద‌ చేయి వేసుకొని ఆలోచించమని మిమ్మ‌ల్ని కోరుతున్నా అని విజ్ఞప్తి చేశారు.





Untitled Document
Advertisements