మూడో సారి టైటిల్ పై కన్నేసిన కోల్‌కతా

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 10:54 AM

మూడో సారి టైటిల్ పై కన్నేసిన  కోల్‌కతా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తనదైన ముద్ర వేసింది. ఇప్పటి వరకు 11 సార్లు ఐపిఎల్ పోటీలు జరుగగా కోల్‌కతా రెండు సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఈసారి కూడా కోల్‌కతా విజయమే లక్షంగా పెట్టుకుంది. ఐపిఎల్ ప్రతి సీజన్‌లోనూ కోల్‌కతా ఫేవరెట్‌గా బరిలోకి దిగడం అనవాయితీ. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లు కోల్‌కతాకు ప్రాతినిథ్య వహించడం సంప్రదాయంగా వస్తోంది. 2008 సీజన్ నుంచి ఇప్పటి వరకు కూడా కోల్‌కతా జట్టులో దిగ్గజ ఆటగాళ్లకు కొదవలేదు. ముంబయి ఇండియన్స్, చెన్నై, బెంగళూరు జట్లకు దీటుగా కోల్‌కతాలో కూడా అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండడం అనవాయితీగా వస్తోంది. తొలి సీజన్ నుంచి బరిలో దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ మెరుగైన ఆటతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. టోర్నీ ఆరంభంలో పేలవమైన ఆటలతో ఈ జట్టు నిరాశ పెట్టినా తర్వాత మెరుగ్గా ఆడుతూ ఐపిఎల్‌పై తనదైన ముద్ర వేసింది. తొలి మూడు సీజన్‌లలో కోల్‌కతా ఘోరంగా విఫలమైంది. అయితే నాలుగో సీజన్‌లో ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతాకు ఓటమి ఎదురైంది. ఎప్పుడైతే 2012 సీజన్‌లో గౌతం గంభీర్ కోల్‌కతా జట్టులో చేరాడో అప్పటి నుంచి ఆ జట్టు దశ మారిపోయిందనే చెప్పాలి.

గంభీర్ సారథ్యంలో కోల్‌కతా ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది.ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కోల్‌కతా ఏకంగా ట్రోఫీని గెలిచి ప్రకంపనలు సృష్టించింది. ఫైనల్లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి తొలిసారి ఐపిఎల్ విజేతగా నిలిచింది. అయితే తర్వాతి సీజన్‌లో కోల్‌కతా పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. ఈసారి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ, 2014లో కోల్‌కతా మరోసారి సత్తా చాటింది. అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఫైనల్‌కు చేరుకుంది. తుది పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించి తన ఖాతాలో రెండో ఐపిఎల్‌ను జత చేసుకుంది. తర్వాత కూడా కోల్‌కతా మెరుగ్గానే ఆడినా మరోసారి ట్రోఫీని గెలవలేక పోయింది. కిందటి సీజన్‌లో ప్లేఆఫ్ దశలో ఓటమి పాలైంది. ప్రస్తుతం కూడా కోల్‌కతా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. అగ్రశ్రేణి ఆటగాళ్లతో చాలా బలంగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతోంది. టీమిండియా స్టార్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఈసారి కూడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రాబిన్ ఉతప్ప, సునీల్ నరైన్, బ్రాత్‌వైట్, క్రిస్‌లీన్, శుభ్‌మన్ గిల్, ఆండ్రి రసెల్, ఫెర్గూసన్, కుల్దీప్ వంటి ప్రతిభావంతులు కోల్‌కతాకు అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే కోల్‌కతా ఆటగాళ్లు కఠోర సాధనలో నిమగ్నమయ్యారు. మార్చి 24న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో కోల్‌కతా తన పోరాటాన్ని ప్రారంభించనుంది.





Untitled Document
Advertisements