టీడీపీకి గుడ్ బై చెప్పేసిన మాజీ ఎంపీ

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 11:43 AM

టీడీపీకి గుడ్ బై చెప్పేసిన మాజీ ఎంపీ

టీడీపీలో మాజీ ఎంపీ హర్షకుమార్ చేరిక నాలుగు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. చేరిక రోజు చంద్రబాబు కాళ్ల మీద పడినంత పనిచేసిన ఆయన.. అమలాపురం లోక్‌సభ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మాజీ ఎంపీ అయిన హర్షకుమార్ చంద్రబాబు కాళ్లపై పడటం మీద దళిత వర్గాల నుంచి సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకున్న ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. గురువారం రాజమండ్రిలో తన అనుచరులు, సన్నిహితులతో చర్చించిన అనంతరం హర్షకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, అమలాపురం నుంచి దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్ మాధుర్‌కు టీడీపీ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. అమలాపురం టికెట్ దక్కుతుందన్న ఆశతో టీడీపీలో చేరిన హర్షకుమార్.. ఆ టికెట్ వేరేవాళ్లకు వెళ్లడంతో తీవ్రంగా నొచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారు.

ఈయన టీడీపీలో చేరిన సమయంలో చంద్రబాబు కాళ్లు మొక్కారు. అదే అప్పుడు, ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీటు కోసం ఎంతకైనా తెగిస్తారా? సీటు ఇవ్వాలని అప్పుడు కాళ్లు పట్టుకున్నావు. ఇప్పుడు సీటివ్వలేదని మెడ పట్టుకుంటావా? అందుకే టీడీపీకి రాజీనామా చేశావా? అంటూ ఏపీ ప్రజలు హర్షకుమార్ పై దుమ్మెత్తిపోస్తున్నారట. దళితులు, ప్రజా సంఘాలు కూడా ఆయన చంద్రబాబు కాళ్లు పట్టుకున్నప్పుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

మరోవైపు.. ఆయన పార్టీని వీడిన అనంతరం… సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు ఒక్కటే అంటూ బాంబు పేల్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు దమ్ముంటే టీడీపీతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ టికెట్లను టీడీపీ ఖరారు చేస్తోందంటూ మండిపడ్డారు.

ఈసారి ఎన్నికల్లో పోటీ చేయట్లేదని.. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మీరు మాత్రం మీకు నచ్చిన వారికి ఓటేసుకోండి.. అంటూ హర్షకుమార్ తన అనుచరులకు తెలిపారు.

Untitled Document
Advertisements