రూ.8వేల కోట్లు ఎగ్గొట్టిన పటేల్ అరెస్ట్

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 09:00 AM

రూ.8వేల కోట్లు ఎగ్గొట్టిన పటేల్ అరెస్ట్

న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్లు మోసం చేసి విదేశాలకు పారిపోయిన నేరగాళ్లు ఒక్కొక్కరు పట్టుబడుతున్నారు. తాజాగా రూ.8100 కోట్ల బ్యాంక్ రుణం మోసం కేసులో స్టెర్లింగ్ బయోటిక్ ప్రమోటర్ హితేశ్ పటేల్‌ను అలబానియాలో పోలీసులు అరెస్టు చేశారు. త్వరలోనే అతడిని భారత్‌కు అప్పగించనున్నారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ పలు బ్యాంకులకు రూ. 8,100 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంస్థ నిర్వాహకులైన నితిన్ సందేశర, చేతన్ సందేశర, దీప్తి, హితేశ్ పటేల్ తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు పొందారు.

వీరు మనీలాండరింగ్ పాల్పడినట్టు తేలడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వారిపై అభియోగాలు నమోదు చేశారు. అప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు దేశం విడిచి పారిపోయారు. దీంతో వీరిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించేందుకు ఇడి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించగా, వీరిపై ఈ నెల 11న రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. దీంతో నిందితుల్లో ఒకరైన హితేశ్ పటేల్‌ను ఈ నెల 20న అలబానియా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నితిన్, చేతన్‌లపై కూడా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.





Untitled Document
Advertisements