గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

     Written by : smtv Desk | Fri, Apr 12, 2019, 03:26 PM

గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

ప్రముఖ నగదు లావాదేవీల యాప్ గూగుల్ పే ఇప్పుడు బంగారం మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ యాప్ ద్వారా బంగారం కొనొచ్చు. విక్రయించొచ్చు. ఇందుకోసం టెక్ దిగ్గజం గూగుల్ గురువారం ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. పేటీఎం, మొబిక్విక్ వంటి యాప్స్ ఇప్పటికే ఈ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. బంగారం భారతీయుల సంస్కృతి, సాంప్రదాయంలో ముఖ్యమైందని గూగుల్‌ పే ఇండియా డైరెక్టర్‌ (ప్రొడక్ట్‌ మేనేజర్‌) అంబరీష్‌ కెంఘే తెలిపారు. అందుకే బంగారం వినియోగంలో భారత్‌ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్నారు. అక్షయ తృతీయ, ధంతేరస్‌ లేదా దీపావళి వంటి పర్వదినాల్లో భారతీయులు అధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారని పేర్కొన్నారు. గూగుల్ పే యూజర్లు 99.99 శాతం 24 క్యారెట్ బంగారాన్ని ఎప్పుడైనా, ఎంతమొత్తంలోనైనా కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారాన్ని యాప్ యూజర్ తరఫున ఎంఎంటీసీ-పీఎఎంపీ సురక్షితమైన లాకర్లలో భద్రపరుస్తుంది. ఇకపోతే అనుమతులు లేకుండా గూగుల్‌ పే విధంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోందంటూ బుధవారం ఢిల్లీ హైకోర్టు.. రిజర్వు బ్యాంకును ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూగుల్‌ పే కార్యకలాపాలపై సందిగ్ధత నెలకొంది. కానీ మరుసటి రోజే గూగుల్‌ పేలో బంగారం కొనుగోలు చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.





Untitled Document
Advertisements