CSK vs KKR : ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని

     Written by : smtv Desk | Sun, Apr 14, 2019, 04:18 PM

CSK vs KKR : ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందిన కోల్‌కతా జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కోల్‌కతా సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగుతుండటం.. ఆ జట్టుకి లాభించే అంశం. గాయంతో గత మ్యాచ్‌కి దూరమైన సునీల్ నరైన్, క్రిస్‌లిన్ మళ్లీ కోల్‌కతా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. చెన్నై జట్టులో ఓపెనర్ షేన్ వాట్సన్‌ పేలవఫామ్‌ని కొనసాగిస్తుండగా.. మరో ఓపెనర్ అంబటి రాయుడు ఎట్టకేలకి ఫామ్‌ అందుకున్నాడు. ఇక మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, మహేంద్రసింగ్ ధోనీ, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా నిలకడగా రాణిస్తూ ఆ జట్టుకి వరుస విజయాల్ని అందిస్తున్నారు. బౌలింగ్‌లోనూ దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్ వికెట్లు పడగొడుతూ.. ప్రత్యర్థుల్ని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తుండటం.. చెన్నై విజయాల్లో కీలకంగా మారుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి ఇప్పటికీ నిలకడైన ఓపెనర్లు దొరకడం లేదు. ఇప్పటికే సునీల్ నరైన్, క్రిస్‌లిన్ కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ చేయగా.. చివరి మ్యాచ్‌లో శుభమన్ గిల్ ఓపెనర్‌గా వచ్చి అర్ధశతకంతో మెరిశాడు. దీంతో.. ఈ మ్యాచ్‌లో ఎవరు ఓపెనర్లుగా వస్తారు..? అనేదానిపై స్పష్టత లేదు. ఇక మిడిలార్డర్‌లోనూ ఆండ్రీ రసెల్ మినహా ఎవరూ నిలకడగా రాణించడం లేదు. కెప్టెన్ దినేశ్ కార్తీక్, నితీశ్ రాణా.. ఇప్పటికీ ఒక్క గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేదు. రాబిన్ ఉతప్ప పరిస్థితి కూడా దాదాపు అంతే. బౌలింగ్‌ విభాగంలోనూ యువ పేసర్ ప్రసీద్ తేలిపోతుండగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లా వికెట్లు పడగొట్టలేకపోతున్నారు. దీంతో.. ఒకింత ఒత్తిడిలోనే కోల్‌కతా బరిలోకి దిగుతున్నా.. ఇప్పటికే దాదాపు నాలుగు మ్యాచ్‌ల్ని ఆండ్రీ రసెల్‌ ఒంటిచేత్తో గెలిపించి ఉండటంతో.. చెన్నైకి అతనితో ప్రమాదమే..!





Untitled Document
Advertisements