పంత్ ఓకే...రాయుడిని చూస్తేనే హృదయం ద్రవిస్తోంది : గంభీర్

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 07:14 PM

పంత్ ఓకే...రాయుడిని చూస్తేనే హృదయం ద్రవిస్తోంది : గంభీర్

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసిన జట్టులో అంబటి రాయుడు లేకపోవడం తీవ్ర బాధ కలిగిస్తోందని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్ అన్నాడు. రిషభ్‌పంత్‌ తనకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకోలేదని వెల్లడించాడు. ఇప్పుడు చర్చ జరగాల్సింది అంబటి రాయుడి గురించేనని పేర్కొన్నాడు. 'తెలుపుబంతి క్రికెట్‌లో 48 సగటు, 33 ఏళ్ల వయసున్న క్రికెటర్‌ను వదిలేయడం చాలాచాలా దురదృష్టకరం. మిగతా సెలక్షన్‌ నిర్ణయాలతో పోలిస్తే నాకైతే ఇది గుండెపగిలేంత బాధగా అనిపిస్తోంది. రాయుడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. 2007లో నన్ను ఎంపిక చేయనప్పుడు నేనిలాంటి పరిస్థితే ఎదుర్కొన్నా. ప్రపంచకప్‌నకు ఎంపికవ్వకపోవడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. ఇది ప్రతి ఒక్కరి కల. ఎంపికవ్వని మిగతా క్రికెటర్లతో పోలిస్తే రాయుడిని చూస్తేనే హృదయం ద్రవిస్తోంది' అని గంభీర్‌ అన్నాడు. ఏడాదిన్నర కాలం బాగా ఆడిన అంబటి రాయుడు సొంతగడ్డపై ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించలేదు. దీనిని పరిగణనలోకి తీసుకొని సెలక్టర్లు వేటువేశారని భావిస్తున్నారు. 'రిషభ్‌పంత్‌ను తీసుకోకపోవడం ఎదురుదెబ్బ ఎలా అవుతుంది? వన్డే క్రికెట్‌లో అతడు నిలకడగా రాణించలేదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేదు. దీన్ని ఎదురుదెబ్బ అనొద్దు. పంత్‌ టెస్టు క్రికెట్‌ ఆడాడు. అందుకు సంతోషించాలి. అతడికింకా చాలా వయసుంది. ఎవరైనా సరే వర్తమానంలోనే ఉండాలి. అనుభవం, మ్యాచ్‌లు ముగించడం రీత్యా పంత్‌ కన్నా డీకే మెరుగని సెలక్టర్లు భావించొచ్చు. వన్డే క్రికెట్‌లో చాలాకాలం దినేశ్‌ కార్తీక్‌ బ్యాకప్‌ కీపర్‌గా ఉంటున్నాడు. నా దృష్టిలో మాత్రం సంజు శాంసన్‌ రెండో వికెట్‌కీపర్‌గా బాగుంటాడు. సుదీర్ఘకాలం నాలుగో స్థానంలో ఆడగలడు' అని గంభీర్‌ అన్నాడు.





Untitled Document
Advertisements