ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం 600 కోట్లు ఖర్చు

     Written by : smtv Desk | Fri, Apr 19, 2019, 02:47 PM

ఆంధ్రప్రదేశ్  ఎన్నికల కోసం 600 కోట్లు ఖర్చు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ రెండు ఎన్నికలు తొలిదశలోనే ముగిశాయి. 79 శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. తంతు మొత్తం ముగిశాక ఎన్నికలు జరిగిన తీరు సరిగా లేదని అధికార ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. ఢిల్లీ వెళ్లి మరీ పోరాడుతోంది. ఈ ఎన్నికల కోసం ఎలక్షన్ కమీషన్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. రాజకీయపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈవీఎం మిషన్లు, ఎన్నికల సిబ్బంది, రవాణా ఖర్చు, భద్రతా సిబ్బంది ఏర్పాటు, ఓటర్లకు కనీస సౌకర్యాల ఏర్పాటు ఇలా అనేక పనుల కోసం కోట్లాది రూపాయల్ని ఖర్చు పెట్టింది.

ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది లెక్కల ప్రకారం ఈ ఎన్నికల కోసం 550 కోట్ల నుండి 600 కోట్ల వరకు ఖర్చైనట్టు తెలుస్తోంది. ఇది చిన్న మొత్తమేమీ కాదు. ఇంత ఖర్చు చేసినా ఎన్నో ఆరోపణలు, విమర్శలు, పెదవి విరుపులు తప్పలేదు. ఈ మొత్తంలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మిగతా సగాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అది కూడా మొదట మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయాలి. ఆ తరవాత లెక్కల్ని కేంద్రానికి పంపితే వారు సగం ఖర్చును రీఎంబర్స్ చేస్తారు. ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 2118 మంది, 25 పార్లమెంట్ స్థానాలకు 219 మంది పోటీపడ్డారు. వీరిలో ఎవరెవరిని గెలుపు వరించిందో మే 23న తెలియనుంది.





Untitled Document
Advertisements