ఇంజినీరింగ్ విద్యార్థిని మధు హత్య కేసులో కీలక మలుపు

     Written by : smtv Desk | Fri, Apr 19, 2019, 04:11 PM

 ఇంజినీరింగ్ విద్యార్థిని మధు హత్య కేసులో కీలక మలుపు

కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని మధు మృతి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. కాని ఆమెను దారుణంగా రేప్ చేసి మృతదేహం సగం కాలిన తర్వాత చెట్టుకు ఉరేశారని ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

రాయ్‌చూర్‌లో నవోదయ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధు ఈ నెల 13న అదృశ్యమైంది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడురోజుల తర్వాత(ఏప్రిల్ 16) ఆమె మృతదేహం నవోదయ కాలేజీకి 5-6 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో లభ్యమైంది. కాలిన స్థితిలో చెట్టుకు ఉరేసుకున్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. బ్యాక్‌ల్యాగ్స్ ఉన్న కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మధు పేర్కొన్నట్లుగా ఉన్న ఓ లేఖ అక్కడ పోలీసులకు దొరికింది. దీంతో వారు దీన్ని ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకున్నారు.

అయితే ఇక్కడే పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సగం కాలిన స్థితిలో మధు ఎలా ఉరేసుకుంటుందని, అయినా తనకు బ్యాక్‌ల్యాగ్ ఏమీ లేవని అన్ని పరీక్షల్లోనూ పాసైందని కుటుంబసభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. మధును ఎవరో రేప్ చేసి… దారుణంగా హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

మధుకు న్యాయం జరిగేలా కొందరు సోషల్‌మీడియా వేదికగా పోరాటం మొదలుపెట్టారు. ఇందుకోసం ట్విటర్‌లో #JusticeForMadhu అనే హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements