ఓపక్క టెన్నిస్‌ శిక్షణ... మరోపక్క దొంగతనాలు

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 01:13 PM

ఓపక్క టెన్నిస్‌ శిక్షణ... మరోపక్క దొంగతనాలు

బాల్యంలోనే చోరీకి పాల్పడి జువైనల్‌ హోంలో ఉన్నాడు. బయటకు వచ్చాకైనా బుద్ధి మార్చుకోలేదు. చోరీలనే కేరాఫ్‌గా మార్చుకున్నాడు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా అదే తీరు. మధ్యలో చిన్న చేంజ్‌. టెన్నిస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరి శిక్షకుడి అవతారం ఎత్తాడు. పగలు కోచింగ్‌, వీలు చిక్కితే దొంగతనాలు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు.

మాదాపూర్‌ జోన్‌ డీసీపీ, కూకట్‌ పల్లి ఏసీపీ తెలియజేసిన వివరాలు ఇవీ. రాజమండ్రి వై.జంక్షన్‌కు చెందిన కోమలి రామకృష్ణ (24) అలియాస్‌ బాబీ ఇంటర్‌ పూర్తి చేశాడు. అమ్మమ్మే ఇతన్ని పెంచి పెద్దచేసింది. 2012లో రాజమండ్రిలో ఓ చోరీ చేయడంతో పోలీసులు జువైనల్‌ హోంకు పంపారు. బయటకు వచ్చిన తర్వాత కూడా రాజమండ్రి మూడో టౌన్‌, ధవళేశ్వరం, రాజానగరం ఠాణా పరిధుల్లో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు.

2017లో హైదరాబాద్‌ చేరుకుని తొలుత నిజాంపేట ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటూ కూరగాయలు అమ్మి జీవనోపాధి పొందేవాడు. 2018లో ఓ అపార్ట్‌మెంట్లో గృహోపకరణాలు దొంగిలించడంతో తన పాత జీవితాన్ని ప్రారంభించాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చోరీలనే ప్రధాన వ్యాపకంగా మార్చుకున్నాడు. కాకపోతే పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఓ టెన్నిస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరాడు. ఓ వైపు శిక్షణ ఇస్తూ పరిచయం ఉన్న వారి ఇళ్లలో చోరీకు పాల్పడేవాడు.

రామకృష్ణ పనిచేసే కోచింగ్‌ సెంటర్‌లో ఓ వైద్యుని కుమారుడు శిక్షణ పొందేవాడు. ఆ బాలుడిని శిక్షణ పూర్తయ్యాక ఇంట్లో దింపి వెళ్లేవాడు. ఈ విధంగా ఆ కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగింది. తాము ఊరెళ్తున్నామని బాలుడు చెప్పడంతో రామకృష్ణ వైద్యుని ఇంటిపై కన్నేశాడు. వారు గత నెల 25న తీర్థయాత్రకు వెళ్లగా, 27న ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.

వైద్యుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణ పాత చరిత్ర, వైద్యుని ఇంటికి బాలుడిని డ్రాప్‌ చేస్తున్న విషయాలు తెలుసుకుని అదుపులోకి తీసుకుని విచారించడంతో చోరీకి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. బాలుడి వద్ద నుంచి ఇంటి తాళం చెవి ఒకటి కొట్టేసి చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.





Untitled Document
Advertisements