లేడీ లాయర్లకు సైతం తప్పని లైంగిక వేధింపులు.....ప్రతి ముగ్గురిలో ఒకరికి

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 02:19 PM

లేడీ లాయర్లకు సైతం తప్పని లైంగిక వేధింపులు.....ప్రతి ముగ్గురిలో ఒకరికి

న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు తమ సీనియర్లు, సహచర లాయర్ల నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు వెల్లడైంది. న్యాయవాద వృత్తిలో లైంగిక వేధింపుల గురించి ప్రపంచంలోనే అతిపెద్ద సర్వేను లండన్‌లోని ఇంటర్నేషనల్ బార్ అసోషియేషన్(ఐబీఏ) నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లోని సుమారు 7వేల మందిపై నిర్వహించిన ఈ సర్వే నివేదికను బుధవారం ఆ సంస్థ వెలువరించింది. నివేదిక ప్రకారం.. న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు తమ సీనియర్లు, సహచర లాయర్ల నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నారు.

వీరిలో 75 శాతం మంది.. తమకు జరిగిన అన్యాయం గురించి నిందితులపై ఫిర్యాదు చేయడంగానీ, ఘటనకు సంబంధించి ఇతరులతో మాట్లాడటంగానీ చెయ్యట్లేదు. లైంగిక వేధింపులు చేస్తున్న వాళ్ళు సీనియర్లు కావడం, చెబితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయం నేపథ్యంలో సగం మంది బాధితులు జరిగిన ఘటనపై నోరుమెదపట్లేదు. ఇక, న్యాయవాద వృత్తిలో ఉన్న పురుషుల్లోనూ దాదాపు 7 శాతం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వీరిలో కొందరు తమకు జరిగిన వేధింపులపై ఫిర్యాదు చెయ్యట్లేదు.

నాకు జరిగిన లైంగిక వేధింపులపై ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. పురుషుడు శృంగారాన్ని తిరస్కరించాడు అంటే ఎవరు నమ్ముతారు? అని స్వీడిష్‌కు చెందిన ఓ పురుష ఉద్యోగి పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులపై గళమెత్తిన మీటూ ఉద్యమానికి.. అధ్యయనంలో పాల్గొన్న చాలా మంది ధన్యవాదాలు తెలిపారు. లైంగిక వేధింపులపై దాఖలైన మూడొంతుల కేసుల్లో నిందితులపై చర్యలు తీసుకోలేదని, సగం కంటే ఎక్కువ కేసుల్లో ఫిర్యాదు తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు కనిపించలేదని నివేదిక పేర్కొంది.

Untitled Document
Advertisements