తెలంగాణను తాకనున్న తొలకరి తళుకు..!!

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 04:05 PM

తెలంగాణను తాకనున్న తొలకరి తళుకు..!!

నైరుతి రుతుపవనాలు జూన్ 10-12 తేదీల మధ్య తెలంగాణను తాకవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 18-19 తేదీల మధ్యలో ఈ రుతుపవనాలు తొలుత అండమాన్, నికోబార్ దీవులు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ, వాయవ్య ప్రాంతాలకు వచ్చే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి నాగరత్న బుధవారం తెలిపారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన వారం తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. ఈ నేపథ్యంలో జూన్ రెండోవారంలో తెలంగాణను తొలకరి పలుకరించనున్నది.

అంతకంటే ముందు నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశిస్తాయని నాగరత్న పేర్కొన్నారు. ఈసారి ఉత్తరాదికంటే దక్షిణాదిలో అధిక వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇదిలాఉంటే.. నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యంగా కేరళను తాకవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. జూలై మధ్యనాటికి దేశమంతటా విస్తరిస్తాయి. అయితే ఈసారి ఈ రుతుపవనాల రాక ఐదు రోజులు ఆలస్యమవుతుందని, జూన్ 6న (నాలుగు రోజులు అటు ఇటుగా) కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. జూన్ 4న రుతుపవనాలు కేరళను తాకుతాయని ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ అంచనా వేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది కూడా రుతుపవనాలు ఆలస్యమైతే, 2014 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు వాటి రాక ఆలస్యమైనట్టు అవుతుంది. 2014లో జూన్ 4న, 2015లో జూన్ 6న, 2016లో జూన్ 8న రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించాయి. అయితే రుతుపవనాల రాక ఆలస్యమైనంత మాత్రాన మొత్తం వర్షపాతంపై ప్రభావం చూపకపోవచ్చు. గతేడాది మూడ్రోజులు ముందుగానే (మే 29న) రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి.

అయినప్పటికీ సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. 2017లోనూ ఇలానే జరిగింది. మే 30న రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 95 శాతం (సాధారణం కంటే తక్కువ) వర్షపాతమే నమోదైంది. ఈ ఏడాది దాదాపు సాధారణ వర్షాలే కురుస్తాయని ఏప్రిల్‌లో విడుదల చేసిన తొలి విడుత అంచనాల్లో ఐఎండీ పేర్కొంది. ఎల్పీఏలో 96 శాతం (సాధారణం, సాధారణం కంటే తక్కువ కేటగిరీలకు దరిదాపుల్లో) వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. మరోవైపు స్కైమెట్ మాత్రం ఈ ఏడాది ఎల్పీఏలో 93 శాతం (సాధారణం కంటే తక్కువ) వర్షపాతం కురవొచ్చని అంచనా వేయడం గమనార్హం.

Untitled Document
Advertisements