వారం రోజుల్లో జెట్ ఎయిర్‌వేస్‌ భవిష్యత్ పై స్పష్టత

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 02:39 PM

వారం రోజుల్లో జెట్ ఎయిర్‌వేస్‌ భవిష్యత్ పై స్పష్టత

న్యూఢిల్లీ : రుణ ఉభికిలో చిక్కుకొని తాత్కాలికంగా సేవలను నిలిపివేసిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ భవిష్యత్ పై ఒక వారం రోజుల్లో స్పష్టత రానుందని రుణ సంస్థ అయిన ఎస్‌బిఐ చీఫ్ రజనీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘అనేక అంశాలను పరిశీలిస్తున్నాం. న్యాయపరమైన అభిప్రాయాలను కూడా తీసుకున్నాం, చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను చూస్తున్నాం. వారం రోజుల్లో స్పష్టత వస్తుంది’ అని ఎస్‌బిఐ చీఫ్ అన్నారు. కొంత మంది ఇన్వెస్టర్లు జెట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారని, అయితే వారి సీరియస్‌నెస్‌ను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ఎస్‌బిఐ నేతృత్వంలోని జెట్ ఎయిర్‌వేస్ రుణదాతలు విమాన సంస్థన విక్రయించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. దీనిని సేల్ చేయడం ద్వారా రూ.8400 కోట్ల జెట్ అప్పులను సమీకరించాలని రుణదాతలు భావిస్తున్నారు.కాగా జెట్ ఎయిర్‌వేస్‌ను సీనియర్ మేనేజ్‌మెంట్ వదిలి వెళ్లిపోతోంది. తాజాగా సంస్థ సిఇఒ వినయ్ దుబే, సిఎఫ్‌ఒ అమిత్ అగర్వాల్, చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ రాహుల్ తనేజా, కంపెనీ సెక్రటరీ కులదీప్ శర్మలు గుడ్‌బై చెప్పారు. రుణదాతలు జెట్ ఎయిర్‌వేస్‌ను దారికి తెచ్చేందుకు ఎతిహాద్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో సీనియర్ మేనేజ్‌మెంట్ తప్పుకుంది. దుబే రాజీనామాకు కొన్ని గంటల ముందే కంపెనీ డిప్యూటీ సిఇఒ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సిఎఫ్‌ఒ) అమిత్ అగర్వాల్‌తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన కంపెనీ నుంచి తప్పుకున్నట్లు జెట్ వెల్లడించింది. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది జెట్ ఇంకా వెల్లడించలేదు. జెట్‌ను కొనుగోలు చేసేందుకు రెండు బిడ్ లు మాత్రమే వచ్చాయని ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. మరోవైపు ప్రధాన రుణదాత అయిన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ కూడా బిడ్ వేసింది. ఎతిహాద్‌తో పాటు టిపిజి క్యాపిటల్, ఎన్‌ఐఐపి, ఇండిగో పార్ట్‌నర్స్ కూడా బిడ్‌కు ఆసక్తి చూపించాయి. రుణదాతలు నిధులు ఇవ్వకపోవడంతో ఏప్రిల్ 17న జెట్ విమానాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements