మమ్మల్ని అమెరికా ఏమీ చెయ్యలేదు!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 11:28 AM

మమ్మల్ని అమెరికా ఏమీ చెయ్యలేదు!

బీజింగ్: అగ్ర రాజ్యం అమెరికాపై చైనాకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ హువావె వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ)రెన్ జెన్గ్‌ఫే సంచలన వ్యాఖ్యలు చేశారు. షెన్‌జెన్‌లో జపాన్‌కు చెందిన కొంతమంది విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ....అమెరికా ఆంక్షలు తమ కంపెనీ ఎదుగుదలను ఏమాత్రం అడ్డుకోలేవని, మహా అయితే కంపెనీ వృద్ధి రేటు కాస్త తగ్గవచ్చునేమో కానీ అంతకు మించి ఏమీ కాదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఆంక్షల వల్ల కంపెనీ వృద్ధి రేటులో 20 శాతం దాకా తగ్గుదల ఉండవచ్చేమోనని ఆయన అన్నారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించి తామేమీ చేయలేదని రెన్ చెప్పారు. అమెరికా చెప్పిన విధంగా మేనేజిమెంట్‌లో మార్పులు చేసే అవకాశం కానీ, అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణ అనుమతించే అవకాశం కానీ లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అమెరికానుంచి చిప్స్ కొనుగోలు చేయకపోయినా నష్టం ఏమీ లేదన్నారు.తాము ఇప్పటికే ఈ పరిస్థితికి సిద్ధమైనట్లు చెప్పారు. హువావే ప్రతి ఏటా వివిధ దేశాలనుంచి దాదాపు 67 బిలియన్ డాలర్ల విలువైన విడి భాగాలను కొనుగోలు చేస్తుంది. ఇందులో దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను అమెరికానుంచి కొనుగోలు చేస్తుంది. మరో టెలికాం దిగ్గజం జడ్‌టిఇ కూడా ఇదే వైఖరిని అనుసరిస్తోంది. హువావె, జడ్‌టిఇ కంపెనీలు అమెరికాలో టెలికాం పరికరాలు విక్రయించకుండా అమెరికా వాణిజ్య విభాగం ఆంక్షలు విధించింది. దీంతో అమెరికా కంపెనీలతో వ్యాపారం చేసే అవకాశాన్ని ఈ రెండు కంపెనీలు కోల్పోయాయి. హువావె, దాని అనుబంధ సంస్థలు తమ జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఈ సందర్భంగా అమెరికా పేర్కొంది.





Untitled Document
Advertisements