దక్షిణాఫ్రికా ఈసారైనా!!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 11:30 AM

దక్షిణాఫ్రికా ఈసారైనా!!

దక్షిణాఫ్రికా: క్రికెట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న దక్షిణాఫ్రికా మెగా టోర్నీలో మాత్రం పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. వన్డే, టెస్టుల్లో దక్షిణాఫ్రికా అత్యంత మెరుగైన ఆటు తీరుతో ఎదురులేని శక్తిగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఆస్ట్రేలియా తర్వాత అంతటి బలమైన జట్టుగా సఫారీలకు పేరుంది. అయితే 1992 నుంచి ప్రపంచకప్ ఆడుతున్నా ఒక్కసారి కూడా సౌతాఫ్రికా సెమీఫైనల్ దశ దాటి ముందుకు వెళ్లలేక పోయింది. నాలుగు సార్లు సెమీఫైనల్‌కు చేరినా ఫైనల్‌కు మాత్రం అర్హత సాధించలేక పోయింది. ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టుగా దక్షిణాఫ్రికాకు పేరుంది. ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా సఫారీలకు ఉంది. అరివీర భయంకర ఆటగాడిగా పేరున్న డివిలియర్స్ జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టడంలో డివిలియర్స్, క్రానె, కిర్‌స్టెన్, కలిస్, గిబ్స్, ఎన్తిని, ఆమ్లా తదితరులు విఫలమయ్యారని చెప్పాలి. వ్యక్తిగతంగా చూస్తే ఈ ఆటగాళ్లు అపార ప్రతిభావంతులని చెప్పాలి. కానీ, జట్టుకు ఒక్కసారి కూడా ట్రోఫీని అందించక పోవడం నిజయంగానే దురదృష్టంగా చెప్పాలి. గతంతో పోల్చితే ఈసారి దక్షిణాఫ్రికా కాస్త బలహీనంగా కనిపిస్తోంది. డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో జట్టు బలహీనంగా మారింది. అతినిలా విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడే ఆటగాళ్లు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఇటీవల ముగిసిన ఐపిఎల్ టోర్నమెంట్‌లో రబడా, స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, క్రిస్ మోరిస్‌లు నిలకడగా రాణించారు. ఇది జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. రబడా, తాహిర్‌లు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో కూడా వీరిద్దరూ జట్టుకు చాలా కీలకంగా మారారు. ఇక, బ్యాటింగ్‌లో ఈసారి కూడా జట్టు భారమంత కెప్టెన్ డుప్లెసిస్‌పైనే ఆధారపడింది. అతను రాణించడంపైనే జట్టు గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. స్టార్ ఆటగాడు హాషిం ఆమ్లా బాధ్యతలు కూడా పెరిగాయి. వన్డేల్లో మెరుగైన ఆటగాడిగా పేరున్న ఆమ్లా ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వాడే. ఇక ఈ సారైనా కప్ పై ఆధిపత్యం చేలయిస్తుందో లేదో చూడాలి.





Untitled Document
Advertisements