టీమిండియాతోనే అసలు పోటీ!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 11:31 AM

టీమిండియాతోనే అసలు పోటీ!

లండన్: ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లండ్ టీంకు టీమిండియాతోనే అసలు పోటీ నెలకొందని ఆ జట్టు మాజీ కెప్టెన్ నాసేర్ హుస్సేన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....ఈ వరల్డ్‌కప్‌లో ట్రోఫీని గెలిచే జట్లలో భారత్, ఇంగ్లండ్‌లు ముందు వరుసలో ఉన్నాయన్నాడు. ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయని, ఎవరూ గెలిచినా ఆశ్చర్యం లేదన్నాడు. ఇక, ఈసారి ఇంగ్లండ్‌కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయన్నాడు. సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీ కావడంతో ఇంగ్లండ్ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందన్నాడు. ఇటీవల కాలంలో ఇంగ్లండ్ బలమైన జట్టుగా మారిందన్నాడు. ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా ఇంగ్లండ్‌కు ఉందన్నాడు. స్వదేశం, విదేశి సిరీస్‌లు అనే తేడా లేకుండా తన విజయపరంపర కొనసాగిస్తున్న విషయాన్ని హుస్సేన్ గుర్తు చేశాడు. ఇక, భారత్ నుంచి ఇంగ్లండ్‌కు తీవ్ర పోటీ నెలకొందన్నాడు. ఇరు జట్ల బలబలాలు సమానంగా ఉన్నాయన్నాడు. ఏ జట్టునైనా ఓడించే సత్తా ఇరు జట్లకు ఉందని గుర్తు చేశాడు. భారత జట్టులో ప్రతిభకు కొదవలేదన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తుందన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్, ధావన్, ధోని తదితరులతో భారత్ చాలా బలంగా ఉందన్నాడు. ఉత్తమ ఫినిషర్ ధోనీ కూడా జట్టులో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశమన్నాడు. ఇక బుమ్రా, భువనేశ్వర్‌లతో భారత బౌలింగ్ చాలా పటిష్టంగా ఉందన్నారు. ఇంగ్లండ్ పిచ్‌లపై వీరిని ఎదుర్కొవడం ప్రత్యర్థి బౌలర్లకు చాలా కష్టమన్నాడు. షమి, చాహల్, కుల్దీప్‌లు కూడా మెరుగైన బౌలర్లే అనే విషయాన్ని మరువ కూడదన్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్య రూపంలో భారత్‌కు పదునైన అస్త్రం అందుబాటులో ఉందన్నాడు. హార్దిక్ ఈ ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించడం ఖాయమని నాసేర్ జోస్యం చెప్పాడు. ఇదిలావుంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను కూడా తక్కువ అంచన వేయలేమన్నాడు. ఈసారి ప్రపంచకప్ ఉత్కంఠభరితంగా సాగడం ఖాయమని హుస్సేన్ జోస్యం చెప్పాడు.





Untitled Document
Advertisements