బుర్ఖా తీయమన్న వైద్యుడు... డాక్టర్ నే తీసేసిన యాజమాన్యం

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 12:29 PM

బుర్ఖా తీయమన్న వైద్యుడు... డాక్టర్ నే తీసేసిన యాజమాన్యం

మహిళ బుర్ఖా తీయమన్నందుకు ఓ డాక్టర్ జీవితం చిక్కుల్లో పడింది. ఇంగ్లండ్‌లోని రాయల్ స్ట్రోక్ యూనివర్శిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వైద్యం కోసమని ఆసుపత్రిలోని కన్సల్టింగ్ గదిలోకి ముగ్గురు రాగా.. అందులో బుర్ఖా ధరించిన మహిళ మాటలు సరిగ్గ అర్థం కాకపోవడంతో కీథ్ వోల్వర్‌సన్(52) అనే డాక్టర్ బుర్ఖా తీసి మాట్లాడాల్సిందిగా కోరాడు. అందుకు అంగీకరించిన మహిళ బుర్ఖా తీసి తన సమస్యను వివరించింది.

అయితే అరగంట తరువాత మహిళ భర్త ఆసుపత్రికి రాగా.. బుర్ఖా లేకుండా ఉన్న మహిళను చూసి కోపగించుకున్నాడు. అదే సమయంలో మహిళ తాను బుర్ఖా తీయనని చెప్పినా డాక్టర్ బలవంతంగా తీయించాడని భర్తతో చెప్పింది. అంతేకాకుండా తన వైపు తేడాగా చూశాడని ఏడూస్తూ ఆందోళన చెందింది. అంతే వెంటనే డాక్టర్ జాత్యహంకారానికి పాల్పడ్డాడని మహిళ, ఆమె భర్త యూనివర్శిటీలోని పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ చేసిన పని తమకు ఆగ్రహం తెప్పించిందని రమధాన్ ఫౌండేషన్ సభ్యులు మహమ్మద్ షఫీఖ్ అన్నారు.

మహిళా వైద్యురాలికి అప్పగించాలి కానీ సంప్రదాయంగా ఉన్న బుర్ఖా తీయమనడం ఏంటని డాక్టర్‌ను ప్రశ్నించారు. కాగా, డాక్టర్ జాత్యహంకారానికి పాల్పడ్డాడని ఆయనపై పైఅధికారులు చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆయనను ఉద్యోగం నుంచి కూడా తీసే పరిస్థితులు కనపడుతున్నాయి. మరోపక్క తాను చేసిన దాంట్లో ఏం తప్పు లేదని డాక్టర్ వాదిస్తున్నారు. 23 ఏళ్ల కెరీర్‌లో ఎందరో ముస్లిం మహిళలకు వైద్యం అందించానని వారితో ఎప్పుడూ ఇటువంటి సమస్య రాలేదని పేర్కొన్నారు. తాను ఏం చేయనప్పటికీ.. తనపై చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements