బీజేపీకి ఓటేసేవారందరూ చదువు రానివారే: కాంగ్రెస్ నేత అవమానకర వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 08:00 PM

బీజేపీకి ఓటేసేవారందరూ చదువు రానివారే: కాంగ్రెస్ నేత అవమానకర వ్యాఖ్యలు

బీజేపీ మద్దతుదారులపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటేసేవారందరూ చదువు రానివారేనని అవమానకర వ్యాఖ్యలు చేశారు. కేరళలో బీజేపీ కనీసం ఒక్కసీటును కూడా గెలవలేకపోయిందని, కేరళ ప్రజలు చదువుకున్నవారు కావడమే అందుకు కారణమని అన్నారు.

వాయవ్య ఢిల్లీ నుంచి బీజేపీ టికెట్‌ను ఆశించి భంగపడిన ఈ దళిత నేత తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. వాయవ్య ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అయిన ఉదిత్ రాజ్‌ను కాదని సింగర్ హన్స్ రాజ్ హన్స్‌కు బీజేపీ కేటాయించింది. ఢిల్లీలోని ఏడు స్థానాల్లోనూ బీజేపీ సర్వే చేయించిందని, కానీ ఒక్క వాయవ్య ఢిల్లీ స్థానం మాత్రమే బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు తేలిందన్నారు.

ఉదిత్ రాజ్ వ్యాఖ్యలకు ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన టామ్ వడక్కమ్ స్పందించారు. కేరళ గురించి, అక్కడి పరిస్థితుల గురించి ఆయనకు ఏమీ తెలియదని విమర్శించారు. కాగా, ఆదివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో కేరళలో బీజేపీ ఖాతా తెరుస్తుందని అంచనా వేశాయి.

కాంగ్రెస్ - యూడీఎఫ్ కూటమి 16 స్థానాలు, లెఫ్ట్ ఆరు సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నాయి. కాగా, తిరువనంతపురం, పథనమ్‌థిట్ట, పాలక్కాడ్, త్రిసూర్‌ స్థానాలపై తమకు గట్టి నమ్మకం ఉందని, కనీసం మూడు స్థానాలు గెలుచుకుంటామని కేరళ బీజేపీ అధికార ప్రతినిధి జేఆర్ పద్మకుమార్ తెలిపారు.

Untitled Document
Advertisements