ఏడుపు పోటీలు.. ఎవరు ఎక్కువగా ఏడిస్తే...వాళ్లు గెలిచినట్టు

     Written by : smtv Desk | Tue, May 21, 2019, 09:46 AM

ఏడుపు పోటీలు.. ఎవరు ఎక్కువగా ఏడిస్తే...వాళ్లు గెలిచినట్టు

చిన్న పిల్లల డ్యాన్స్‌ పోటీలను చూసే ఉంటారు. వెల్‌ బేబీ షోల గురించి వినే ఉంటారు. మరి ‘బేబీ క్రైయింగ్‌ కాంటెస్ట్‌’ గురించి ఎప్పుడైనా విన్నారా? జపాన్‌లో నిర్వహించే ఆ పోటీల కబుర్లు.......చిన్న పిల్లల కోసం డ్యాన్స్‌ పోటీలు, క్విజ్‌ పోటీలు నిర్వహిస్తుంటారు. కానీ జపాన్‌లో మాత్రం పిల్లల కోసం ఏడ్చే పోటీలను నిర్వహిస్తారు. అంటే పిల్లల్లో ఎవరు బాగే ఏడిస్తే వాళ్లు గెలిచినట్టు. ఇదేదో తమాషాగా అనిపిస్తుంది కదూ! కానీ ఇది అక్కడ సంప్రదాయంగా వస్తోంది. టోక్యోలోని సెన్సొజి ఆలయంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో పిల్లలతో పాటు సుమోలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.

పోటీలో ఉన్న పిల్లలను సుమోలే ఎత్తుకుంటారు. పిల్లాడు ఏడవకపోతే సుమోలు ఏడ్చేలా చేస్తారు. ఒక్కో పిల్లాడి దగ్గరకు పూజారులు వెళ్లి గమనిస్తారు. బాగా ఏడ్చిన పిల్లాడిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఇంతకీ ఈ పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారంటే పిల్లలను సుమోలు ఎత్తుకుని ఏడిపించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని కొందరు జపనీయుల నమ్మకం.

దుష్టశక్తులు పిల్లల దరిచేరకుండా ఉంటాయని మరికొందరు విశ్వసిస్తారు. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. పోటీలు జరిగే రోజుల్లో తల్లితండ్రులు పిల్లలను తీసుకొని ఆలయానికి వస్తారు. పోటీలు జరిగే సమయంలో ఆలయ పరిసరాలు పిల్లల ఏడుపులతో ప్రతిధ్వనిస్తాయి. భలేగా ఉంది కదూ బేబీ క్రైయింగ్‌ కాంటెస్ట్‌!





Untitled Document
Advertisements