ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఈఫిల్ టవర్ ఎక్కుతుండటం గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని జాగ్రత్తగా కిందకు దించి అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. టవర్ ఎక్కుతున్న వ్యక్తిన గమనించిన వెంటనే అధికారులు టవర్ సందర్శనను నిలిపివేశారు.
వ్యక్తిని కిందకు తెచ్చి పరిస్థితిని మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు అధికారులకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. ఇదే సమయంలో టవర్ పైనున్న టూరిస్ట్‌లను గంటలపాటు అక్కడే ఆపేశారు. దీంతో కొద్ది ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ వ్యక్తి టవర్ ఎందుకు ఎక్కాలనుకున్నడన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఇంతకు ముందు కూడా ప్యారిస్‌లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.
2015లో ఇలానే ఓ వ్యక్తి ఈఫిల్ టవర్ ఎక్కేందుకు ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 2010, 2013లో బాంబు బెదిరింపులు, భద్రతా కారణాల దృష్ట్యా ఈఫిల్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో ఆ సమయంలోనూ టవర్ సందర్శనను నిలిపివేసి పర్యాటకులను వేరే చోటికి తరలించారు.