ప్రపంచకప్ గెలిచే సత్తా ఉంది!

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 11:47 AM

ప్రపంచకప్ గెలిచే సత్తా ఉంది!

ముంభై: ఇంగ్లాండ్ వేదికగా మే 30న ప్రారంభం కానున్న ప్రపంచకప్ టోర్నీపై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ మంగళవారం మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ...గతంతో పోల్చితే ఈసారి ప్రపంచకప్‌లో పోటీ తీవ్రంగా ఉంటుందని, ఒత్తిడిని జయించి ముందుకు సాగే జట్టుకే ట్రోఫీ దక్కుతుందన్నాడు. టీంఇండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉందని, ప్రపంచకప్ గెలిచే సత్తా ఉందని అన్నారు. సమష్టిగా పోరాడితే ఇంగ్లండ్ గడ్డపై మరోసారి చారిత్రక విజయం ఖాయమని, వరల్డ్‌కప్ కోసం ఆటగాళ్లందరూ ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారన్నాడు. ప్రతి మ్యాచ్ కీలకమేనని, దేన్ని కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదని, రానున్న ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచడమే లక్షంగా పెట్టుకున్నట్టు కోహ్లి స్పష్టం చేశాడు. ఇప్పటివరకు తాను ఎన్నో ప్రపంచకప్‌లు ఆడానని, అన్నింటికంటే ఇదే అత్యంత ఛాలెంజింగ్ ప్రపంచకప్ అనడంలో సందేహం లేదన్నాడు. ఇందులో పాల్గొంటున్న ప్రతి జట్టు కూడా ట్రోఫీని సాధించడం లక్షంగా పెట్టుకున్నాయన్నాడు. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లను కూడా తక్కువ అంచన వేసే పరిస్థితి లేదన్నాడు. 1983లో భారత్ కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే ప్రపంచకప్ గెలిచిన విషయాన్ని మరువకూడదన్నాడు. ఇలాంటి నేపథ్యంలో ప్రతి మ్యాచ్ గెలవడం అన్ని జట్లకు ప్రధాన లక్షంగా మారిందన్నాడు.





Untitled Document
Advertisements