వారు గెలుస్తారన్న ఆశలూ ఎవ్వరికీ లేవు!

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 12:42 PM

వారు గెలుస్తారన్న ఆశలూ ఎవ్వరికీ లేవు!

న్యూఢిల్లీ: వరల్డ్ కప్ టోర్నీలో ప్రతీసారి ఫైనల్‌కు చేరుకోకుండానే నిష్క్రమించడం దక్షిణాఫ్రికాకు అలవాటుగా మారింది. దీంతో ఆ జట్టుకి 'చోకర్స్' అనే పేరు వచ్చింది. అయితే దీనిపై జట్టు మాజీ కెప్టెన్ కెప్లర్ వెసెల్స్ మాట్లాడుతూ...ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ గెలిస్తేనే దక్షిణాఫ్రికా ‘చోకర్స్’ పేరు వదిలించుకోగలదని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగకపోవడం అదృష్టమని వెల్లడించాడు. ‘ఐసిసి టోర్నీ గెలిచేంత వరకు జనాలు వారిని చోకర్స్ అని పిలుస్తూనే ఉంటారు. అది నిజం కూడా. 1999లో దక్షిణాఫ్రికా అత్యుత్తమ జట్టు. అయినప్పటికీ ట్రోఫీ గెలవలేకపోయింది’ అని వెసెల్స్ పేర్కొన్నాడు. ‘ఈ సారి దక్షిణాఫ్రికా ఫేవరెట్ కాకపోవడం మంచిదే. వారు గెలుస్తారన్న ఆశలూ చాలామందిలో లేవు. ఇలాంటి ఒత్తిడి లేకపోవడం వల్ల డుప్లెసిస్ సేన సులభంగా సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే పై దశకు వెళ్లొచ్చు. ఇక, ఈ ప్రపంచకప్‌లో ఎబి డివిలియర్స్ లేని లోటు దక్షిణాఫ్రికాపై కచ్చితంగా ఉంటుందని వెసెల్స్ స్పష్టం చేశాడు. మరోవైపు ఇంగ్లండ్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా జట్లకు ప్రపంచకప్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నాడు. భారత్ ఇటీవల కాలంగా చాలా బలంగా మారిందన్నాడు. ఏ జట్టునైనా ఓడించే స్థితిలో భారత్ ఉందన్నాడు. టీమిండియాను ఓడించడం ఇతర జట్లకు చాలా కష్టమన్నాడు. అయితే ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేమని వెసెల్స్ తేల్చి చెప్పాడు.





Untitled Document
Advertisements