అక్రమాస్తుల కేసులో తండ్రీ కొడుకులకు సీబీఐ క్లీన్ చిట్!

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 12:43 PM

అక్రమాస్తుల కేసులో తండ్రీ కొడుకులకు సీబీఐ క్లీన్ చిట్!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌, ఆయన తనయుడు అఖిలేశ్‌ యాదవ్‌లకు ఊరట లభించింది. ఈ కేసులో ఇరువురికీ క్లీన్‌చిట్‌ ఇస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అఖిలేశ్‌, ములాయంపై రెగ్యులర్‌ కేసు నమోదు చేసేందుకు తమకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, అందుకే 2013 ఆగస్టు 7నే విచారణ మూసేసినట్లు సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది.

ములాయం, అఖిలేశ్‌లపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు స్థితిపై నివేదిక ఇవ్వాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆఫిడ్‌విట్ దాఖలుచేసిన సీబీఐ, ఈ కేసులో తమకు ఎలాంటి అధారాలు లభించలేదని స్పష్టం చేసింది.

ములాయం ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబం అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడి అక్రమాస్తులను కూడబెట్టుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్ చతుర్వేదీ 2005లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2007 మార్చి 1న ములాయం, ఆయన కుమారులు అఖిలేశ్ యాదవ్‌, ప్రతీక్‌ యాదవ్‌, కోడలు డింపుల్‌ యాదవ్‌లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత ఈ కేసు నుంచి డింపుల్‌ యాదవ్‌కు మినహాయింపు కల్పించింది.

కానీ, ఇంతవరకు ఈ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవడంపై విశ్వనాథ్‌ చతుర్వేది మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ దీపక్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టి... సీబీఐపై ప్రశ్నల వర్షం కురిపించింది. ములాయం, అఖిలేశ్‌పై కేసు ఏమైంది.. అసలు కేసు నమోదు చేశారా లేదా.. అని గట్టిగానే నిలదీసింది. అంతేకాదు, మార్చి 25న జరిగిన విచారణ సమయంలోనూ రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మంగళవారం నాడు సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది.





Untitled Document
Advertisements