సర్వత్రా ఉత్కంఠ

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 07:34 AM

సర్వత్రా ఉత్కంఠ

సార్వత్రిక ఎన్నికల ఫలితం కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఏపీ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అంతా రెడీ చేశారు అధికారులు. ఫలితాలకు మరి కొంత సమయమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో క్షణక్షణానికి ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 36చోట్ల ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల స్ట్రాంగ్‌రూమ్‌ల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎం) భద్రపర్చారు. ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలో 6 చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపులో మొత్తం 25,000 మందికిపైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. భద్రత కోసం 25,000 మందికిపైగా పోలీసు బలగాలు మోహరించాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంది.
ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, ఆ తర్వతా సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుంది. ఏప్రిల్‌ 11వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించినా దేశవ్యాప్తంగా ఏడు విడతల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉండటంతో ఫలితాల కోసం ఈ దఫా ఏకంగా 41 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా ఈరోజు కౌంటింగ్‌ డే కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ఫలితాలు ఉన్నప్పటికీ అందరి దృష్టీ ఏపీపైనే ఉంది. ఈ రాష్ట్రం ఫలితంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.





Untitled Document
Advertisements