కోహ్లీపై ఆధారపడితే లాభం లేదు!

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:00 PM

కోహ్లీపై ఆధారపడితే లాభం లేదు!

ఈ ప్రపంచకప్ టోర్నీలో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆధారపడితే లాభం లేదని సమష్టిగా పోరాడితేనే భారత్‌కు ట్రోఫీని గెలిచే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ దిగ్గజం సచిన టెండూల్కర్ అన్నారు. ఈ సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడుతూ...ప్రపంచకప్ ఫేవరెట్లలో భారత్ ఒకటని, అయితే ఇతర జట్లు కూడా బలంగా ఉండడంతో ట్రోఫీని గెలవడం అనుకున్నంత తేలికకాదన్నాడు. కొంతకాలంగా ప్రపంచ క్రికెట్‌లో భారత్ బలమైన శక్తిగా ఎదిగిందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదన్నాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో పోటీ తీవ్రంగా ఉంటుందన్నాడు. దీంతో ప్రతి మ్యాచ్‌లో జట్టుపై ఒత్తిడి తప్పదన్నాడు. ఒత్తిడిని జయించి ముందుకు సాగాల్సిన అవసరం ఆటగాళ్లపై ఉందన్నాడు. ప్రపంచకప్‌లో గెలవాలంటే ఒక్క కోహ్లి మాత్రమే రాణిస్తే సరిపోదన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడు తనవంతు పాత్ర పోషించాల్సిందేనన్నాడు. అప్పుడే జట్టుకు విజయం వరుస్తుందన్నాడు. ఇటీవల కాలంలో భారత్ సాధిస్తున్న విజయాల్లో కోహ్లిదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదన్నాడు. కోహ్లి రాణిస్తే గెలవడం, లేకుంటే ఓడిపోవడం భారత్‌కు బలహీనతగా మారిందన్నాడు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నాడు.ఇక, కోహ్లి తర్వాత అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు మాత్రమేనని సచిన్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఏ ఒక్కరు రాణించినా భారత్‌కు విజయం ఖాయమన్నాడు. కానీ, వీరు విఫలమైన సందర్భాల్లో స్వల్ప లక్ష్యాలను కూడా భారత్ ఛేదించక పోవడం ఆందోళన కలిగిస్తుందన్నాడు. ఇక, ఇంగ్లండ్ పిచ్‌లపై బౌలర్లకు ఇబ్బందులు తప్పవన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వన్డే సిరీసే దీనికి నిదర్శనమన్నాడు. 350కి పైగా స్కోర్లు సాధించినా దాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు విఫలమయ్యారన్నాడు. ఇది నిజంగా బౌలర్లకు కలవరానికి గురి చేసే అంశమన్నాడు. అయితే బుమ్రా, భువనేశ్వర్, షమిలతో కూడిన బౌలింగ్ లైనప్ ఇంగ్లండ్ పిచ్‌లపై మెరుగ్గా రాణిస్తుందనే నమ్మకాన్ని సచిన్ వ్యక్తం చేశాడు. మరోవైపు సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని సేవలు ప్రపంచకప్‌లో భారత్‌కు చాలా కీలకమన్నాడు. ధోని జట్టులో ఉండడంతో యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఖాయమన్నాడు. అంతేగాక కెప్టెన్ కోహ్లికి కూడా ధోని సలహాలు ఉపకరిస్తాయని సచిన్ అభిప్రాయపడ్డాడు.





Untitled Document
Advertisements