రానున్న రెండేళ్లలో పెట్టుబడుల ఉపసంహరణ

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 01:09 PM

రానున్న రెండేళ్లలో పెట్టుబడుల ఉపసంహరణ

న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో దేశంలోని పలు సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేయనున్నాయని కన్సల్టింగ్‌ సంస్థ ఈవై వెల్లడించింది. ‘భారతీయ పెట్టుబడుల ఉపసంహరణ అధ్యయనం’ పేరిట ఈవై విడుదల చేసిన నివేదిక ప్రకారం వచ్చే రెండేండ్లలో 81 శాతం కంపెనీలు పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించింది. ఇక 67 శాతం సంస్థలు రాబోయే ఏడాది కాలంలో భారీ స్థాయిలో పెట్టుబడుల మార్పునకు దిగబోతున్నట్లు ప్రకటించాయి. స్థూల ఆర్థిక అనిశ్చితి, సాంకేతికపరమైన సవాళ్లు, భాగస్వాముల ఒత్తిడి, ప్రాంతీయ రాజకీయ అస్థిరత వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయని ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం అన్ని దేశాలపై కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రతికూల పరిస్థితుల్లో వ్యాపారం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయంతోనే కొన్ని రంగాల కార్పొరేట్లున్నారని, సవాళ్లను ఎదుర్కొనే సాహసం వారు చేయడం లేదని కూడా తాజా అధ్యయనంలో తేలింది. బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభ పరిస్థితులూ రుణాల కొరతను సృష్టిస్తుండటంతో ఆర్థిక లావాదేవీల ఆధారిత కంపెనీల నుంచి బయటకుపోదామా? అన్న ఆలోచనలో పలువురు ఉన్నారు. ఇక అన్ని రంగాల్లోని 40కిపైగా సంస్థల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈ అధ్యయనం రూపొందింది. ‘వ్యాపారం అంతగా లేని రంగాల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతోనే చాలామంది కార్పొరేట్లున్నారు. ఇదే సమయంలో పెట్టుబడుల అన్వేషణ చేస్తూ కొత్త రంగాల్లోకీ ప్రవేశించాలని చూస్తున్నారు’ అని ఈవై ఇండియా భాగస్వామి, అధిపతి నవీన్‌ తివారీ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఎక్కడ తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలో అన్నదానిపైనా నేటి సంస్థలకు స్పష్టత ఉందని ఆయన అన్నారు. అయితే ఈ ప్రక్రియ మాత్రం ఆలస్యంగా నడుస్తున్నదని చెప్పారు. అయినప్పటికీ భవిష్యత్‌ పెట్టుబడులపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయని ప్రశంసించారు. ఇక సరైన సమయానికే తమ పెట్టుబడులను ఉపసంహరించి తగిన లాభాలనూ గడిస్తున్నారన్నారు.





Untitled Document
Advertisements