ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా...కాంగ్రెస్ కి కాదా?

     Written by : smtv Desk | Fri, May 24, 2019, 06:18 PM

ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా...కాంగ్రెస్ కి కాదా?

లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి ఈసారి కూడా కాంగ్రెస్‌కు దక్కే అవకాశం కనిపించడం లేదు. 16వ లోక్‌సభలో 44 స్థానాలు మాత్రమే ఆ పార్టీకి రావడంతో ఈ పదవి దక్కలేదు. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి 52 స్థానాలు మాత్రమే లభించాయి. దీంతో ఎంతో కీలకమైన ఈ పదవికి కాంగ్రెస్ ఈసారి కూడా దూరమైంది.

లోక్‌సభ కోరంతో సమానమైన స్థానాలను దక్కించుకున్న పార్టీకి ప్రతిపక్ష నేత పదవి దక్కుతుంది. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 10 శాతం స్థానాలు (55) గెలుచుకున్న పార్టీ నేత ప్రతిపక్ష నేత అవుతారు.

కోరంతో సమానమైన స్థానాలను సాధించిన ప్రతిపక్ష పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలనే నిబంధనను మొదటి లోక్‌సభ స్పీకర్ జీ వీ మావలంకర్ ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష నేత పదవికి చట్టబద్ధ నిర్వచనం 'ప్రతిపక్ష నేత జీత, భత్యాల చట్టం, 1977' లో ఉంది.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి గతంలో కూడా ఖాళీగా ఉండేది. 1951-52, 1957, 1962లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ భారీ ఆధిక్యతతో విజయాలు నమోదు చేసింది. దీంతో ఈ పదవిని దక్కించుకునే అర్హత ఏ పార్టీకీ దక్కలేదు.

లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీని లోక్‌సభ స్పీకర్ గుర్తించాలి. అదే విధంగా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీని రాజ్యసభ చైర్‌పర్సన్ గుర్తించాలి. ఆయా సభల్లో అత్యధిక స్థానాలు పొందిన ప్రతిపక్ష పార్టీకి ఈ గుర్తింపు దక్కుతుంది.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత వివిధ నియామకాల్లో పాలుపంచుకునే అవకాశం ఉంటుంది. లోక్‌పాల్, సీబీఐ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ వంటి పదవుల నియామకాల కమిటీలో సభ్యునిగా పాల్గొనవచ్చు.

Untitled Document
Advertisements