పాక్ ప్రభుత్వ తీరుపై చైనాతో మోడీ చర్చలు

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 12:51 PM

పాక్ ప్రభుత్వ తీరుపై చైనాతో మోడీ చర్చలు

బిష్కెక్: భారత ప్రధాని నరేంద్రమోడీ తాజాగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై పలు కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ...ద్వైపాక్షిక చర్చలు తిరిగి ప్రారంభం కావడానికివీలుగా ఉగ్రవాదానికి తావులేని అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని జిన్‌పింగ్‌కు చెప్పారు. అంతేకాదు, పాక్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి తాను ఎంతో ప్రయత్నించానని, అయితే అవేవీ ఫలించలేదని కూడా ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన ఆంక్షల కమిటీ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నెల రోజుల తర్వాత ఇరువురు సమావేశం అవుతుండడం గమనార్హం.పాకిస్తాన్‌కు అత్యంత సన్నిహిత దేశమైన చైనా ఈ ప్రతిపాదనపై తన సాంకేతిక అభ్యంతరాలను ఉపసంహరించుకోవడంతోనే ఇది సాధ్యమైంది. పాకిస్తాన్‌తో శాంతియుత సంబంధాలనే తాము కోరుకుంటున్నామని భారత్ మొదటినుంచీ చెబుతూ వస్తున్న విషయాన్ని జిన్‌పింగ్‌కు ప్రధాని గుర్తు చేశారని ఇరువురి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. కాగా, ‘చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఎస్‌సిఓ సమావేశం నేపథ్యంలో ప్రధాని ఇక్కడ తన తొలి సమావేశాన్ని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో జరిపారు.ద్వైపాక్షిక సంబంధం బలోపేతం దిశగా ఇరువురు నేతలు అర్థవంతమైన చర్చలు జరిపారు’ అని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో తెలిపింది. చర్చల సందర్భంగా మోడీ జిన్‌పింగ్‌ను భారత్‌కు ఆహ్వానించగా ఆయన అందుకు అంగీకారం తెలిపారు.





Untitled Document
Advertisements