ఆ రాష్ట్రాన్ని "మినీ పాకిస్తాన్" గా మార్చేశారు: బీజేపీ

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 05:56 PM

ఆ రాష్ట్రాన్ని

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా ఇటీవల విరుచుకు పడుతున్న బీజేపీ తన విమర్శలకు మరింత పదును పెడుతోంది. సీఎం మమత, ఆమె పార్టీ కార్యకర్తలు రాష్ట్రాన్ని "మినీ పాకిస్తాన్" గా మార్చేశారంటూ త్రిపుర బీజేపీ మహిళా విభాగం చీఫ్ పాపియా దత్తా వ్యాఖ్యానించారు. త్రిపురకు చెందిన వందలాది మంది మహిళా బీజేపీ కార్యకర్తలు ‘‘జై శ్రీరాం’’ అని రాసిన పోస్టు కార్డులు సిద్ధం చేసినట్టు ఆమె తెలిపారు. మమతా బెనర్జీకి వాటిని పంపనున్నట్టు వెల్లడించారు.

"దేశ వ్యాప్త ఉద్యమంలో భాగంగా త్రిపుర బీజేపీ మహిళా విభాగం తరపున ‘జై శ్రీరాం’ అని రాసిన వందలాది పోస్టు కార్డులను మమతా బెనర్జీకి పంపించనున్నాం. మమతా బెనర్జీ, ఆమె గూండాలు పశ్చిమ బెంగాల్‌ను మినీ పాకిస్తాన్‌లా మార్చేశారు. సత్యానికి మారుపేరైన రాముడి పేరు అంటేనే ఆమెకు గిట్టడం లేదు.."అని దత్తా పేర్కొన్నారు. ఇప్పుడైనా మమతా బెనర్జీ ‘‘జై శ్రీరాం’’ నినాదాన్ని సాధన చేయడం మొదలు పెట్టాలని ఆమె సలహా ఇచ్చారు.

ఇటీవల ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాత్పరా ప్రాంతం మీదుగా సీఎం మమత కాన్వాయ్ వెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సహనం కోల్పోయిన ఆమె తన కారు దిగి వాళ్లను హెచ్చరించి వెళ్లడంతో... బీజేపీ మరింత పెద్ద ఎత్తున ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేయించడం మొదలు పెట్టింది.





Untitled Document
Advertisements