ఫ్రీ జర్నీతో సంస్థ దివాలా తీయాల్సి వస్తుంది

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 08:17 AM

మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో రైల్ వ్యవస్థ రూపకర్త శ్రీధరన్ ఆ ప్రతిపాదనను సమ్మతించవద్దని అన్నారు. ఈ సందర్భంగా ఫ్రీ జర్నీతో సంస్థ దివాలా తీయాల్సి వస్తుందని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. కేజ్రీవాల్ ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పభుత్వం మహిళలకు అంతగా సాయం చేయాలనుకుంటే టికెట్ రుసుమును చెల్లించవచ్చు కదా అని అన్నారు. ఈ ఉచిత ప్రయాణం చేయించడం ఎందుకని ప్రశ్నించారు.

ప్రభుత్వ వనరులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తగదని శ్రీధరన్ అన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ వ్యవస్థ ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నడిచే సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఓ భాగస్వామి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కుదరదని సూచించారు. గతంలో శ్రీధరన్ ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్‌కు చీఫ్‌గా వ్యవహరించారు. దేశంలో మెట్రో వ్యవస్థకు ఆయన్ను ఆద్యుడిగా భావిస్తారు.





Untitled Document
Advertisements