వెస్ట్ ఇండీస్ కి చుక్కలు చూపించిన ఇంగ్లాండ్

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 08:21 AM

సౌతాంప్టన్: ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జోయ్ రూట్ ఆల్‌రౌండ్‌షోతో ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 44.4 ఓవర్లలో కేవలం 212 పరుగులకే చాప చుట్టేసింది. ఇంగ్లండ్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీసి విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 33.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోయ్ రూట్ 100 (నాటౌట్) అజేయ శతకంతో ఇంగ్లండ్‌ను గెలిపించాడు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జోయ్ రూట్, జానీ బైర్‌స్టోలు శుభారంభం అందించారు. రెగ్యూలర్ ఓపెనర్ జాసన్ రాయ్ గాయానికి గురి కావడంతో రూట్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. బైర్‌స్టోతో కలిసి ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచాడు. ఈ టోర్నీలో భీకర ఫామ్‌లో ఉన్న రూట్ విండీస్‌పై కూడా ప్రతాపం చూపించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ విండీస్ బౌలర్లను హడలెత్తించాడు. బైర్‌స్టో కూడా తన మార్క్ షాట్లతో అలరించాడు.

చెలరేగి ఆడిన బైర్‌స్టో ఏడు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించాడు. మరోవైపు రూట్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రూట్ పరుగుల వరద పారించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. అతనికి క్రిస్ వోక్స్ అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ఇంగ్లండ్‌ను లక్షం దిశగా నడిపించారు. వోక్స్ 4 ఫోర్లతో 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు రూట్ 94 బంతుల్లోనే 11 ఫోర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రూట్‌కు ఈ టోర్నీలో ఇది రెండో శతకం కావడం విశేషం. అం తకుముందు పాకిస్థాన్‌పై కూడా రూట్ సెంచరీ సాధించాడు. కాగా, బెన్‌స్టోక్స్ 10 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్ 33.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 212 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

యువ సంచలనం జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్‌లు అద్భుత బౌలింగ్‌తో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు.వీరి ధాటికి ఎదురు నిలువలేక పోయారు. విండీస్ జట్టులో నికోలస్ పూరన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో ఓపెనర్ క్రిస్ గేల్ (36), హెట్‌మెయిర్ (39) మాత్రమే రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్‌వుడ్, ఆర్చర్ మూడేసి వికెట్లు తీశారు. రూట్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించిన రూట్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.





Untitled Document
Advertisements